Begin typing your search above and press return to search.

చెన్నై లోకల్ ట్రైన్ ఎంత షాకిచ్చిందంటే..

By:  Tupaki Desk   |   10 July 2016 9:56 AM GMT
చెన్నై లోకల్ ట్రైన్ ఎంత షాకిచ్చిందంటే..
X
చెన్నైలోని లోకల్ ట్రైన్ ఒకటి చేసిన హడావుడితో రైల్వే యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. ఆదివారం తెల్లవారుజామున మొదలైన కలకలంతో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఎక్కడివి అక్కడ నిలిపివేశారు. ఇంతకీ.. చెన్నై లోకల్ ట్రైన్ ఏం చేసిందన్న విషయానికి వస్తే.. అరక్కోణం రైల్వేజంక్షన్ లో లోకల్ ట్రైన్ ను పార్క్ చేశారు. ఉన్నట్లుండి.. ఎవరితో సంబంధం లేకుండా కదిలిన రైలు ఏకంగా అరకిలోమీటర్ వరకూ వెళ్లిపోయారు.

డ్రైవర్ లేకుండా కదిలిపోయిన ఈ ట్రైన్ ను గుర్తించిన అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. లోకల్ ట్రైన్ ఎఫెక్ట్ తో సిగ్నల్ వ్యవస్థను ఆపేశారు. దీంతో.. చెన్నై చేరుకోవాల్సిన పలుఎక్స్ ప్రెస్ రైళ్లు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి.

ఇలా ఆగిన రైళ్లలో మంగళూరు చెన్నై మొయిల్.. సత్యసాయి ప్రశాంతి నిలయం – చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ తో పాటు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. లోకల్ ట్రైన్ ను పక్కన పెట్టి.. మొత్తం ట్రాక్ ను చెక్ చేసుకున్న తర్వాత రైళ్లు కదిలేందుకు సిగ్నల్ ఇచ్చారు. ఆపి ఉన్న రైలుబండి కదలటం తాము ఇప్పటివరకూ వినలేదని.. అసలు ట్రైన్ ఎలా స్టార్ట్ అయ్యిందన్నది రైల్వే అధికారులకు అంతుబట్టని మిస్టరీగా మారింది. ఆగి ఉన్న రైలు ఎలా కదిలింది? అన్న అంశాన్ని లెక్క తేల్చేందుకు విచారణకు ఆదేశించారు. ఇంతకీ ఆగి ఉన్న రైలుబండి డ్రైవర్ లేకుండా ఎలా కదిలినట్లు..?