Begin typing your search above and press return to search.

ఆ సీఎం ఫ్యామిలీకి జెడ్ ప్లస్ సరిపోదట

By:  Tupaki Desk   |   5 Sep 2016 7:46 AM GMT
ఆ సీఎం ఫ్యామిలీకి జెడ్ ప్లస్ సరిపోదట
X
వీవీఐపీల రక్షణకు కేటాయించే అత్యున్నత భద్రత జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఆ భద్రత కూడా తమ ఫ్యామిలీకి సరిపోటం లేదని చెబుతున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి. పంజాబ్ లో ప్రస్తుతం అధికారపక్షంగా ఉన్న అకాలీల వింత కోరికలు కేంద్రానికి చిరాకుగా మారుతున్నాయి. ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా వారి కోర్కెల చిట్టా తగ్గకపోవటంపై కేంద్రంలోని అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్.. ఆయన కుమారుడు కమ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ బాదల్.. మంత్రివర్గంలో కీలకమైన బిక్రమ్ సింగ్ మజీతియాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఇంతకీఈ మజీతియా ఎవరంటే ఉప ముఖ్యమంత్రికి స్వయాన బావమరిది. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు నేతలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఇస్తున్నారు.

అయినప్పటికీ తమకు ఇస్తున్న భద్రత సరిపోలేదన్న అసంతృప్తి వారి నుంచి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అత్యుత్తమ స్థాయి భద్రత అయిన జెడ్ ప్లస్ భద్రత కూడా సంతృప్తికరంగా లేదన్న నేపథ్యంలో వారికి ఎలాంటి భద్రత ఇవ్వాలన్నది ఇప్పుడు అర్థం కానిదిగా తయారైందన్న మాట వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని.. ఇటీవల రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నాయకుడి మీద దాడి జరిగిన నేపథ్యంలో తమ భద్రతను మరింత పెంచాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత తర్వాత ఇంకెలాంటి భద్రత ఇవ్వాలన్నది అధికారులకు అర్థం కాని పరిస్థితి. రెండు ఎస్కార్ట్ వాహనాలు.. 30 నుంచి 40 మంది కేంద్ర భద్రతా సిబ్బంది 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటున్నా.. తమకు భద్రత సరిపోలేదనే ప్రజాప్రతినిధులకు ఎలాంటి భద్రత కల్పించాలో..?