Begin typing your search above and press return to search.

ఆ మంత్రిని సునిత‌మ్మ మ‌ళ్లీ అవ‌మానించారా?

By:  Tupaki Desk   |   9 Dec 2016 5:06 PM GMT
ఆ మంత్రిని సునిత‌మ్మ మ‌ళ్లీ అవ‌మానించారా?
X
తెలుగుదేశం పార్టీలో మంత్రుల మ‌ధ్య విబేధాలు మరోమారు తెర‌మీద‌కు వ‌చ్చాయ‌ని అంటున్నారు. తాజాగా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లా టీడీపీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయని చెప్తున్నారు. అది కూడా ఇప్ప‌టికీ రెండు ద‌ఫాలు జ‌రిగిన‌ట్లు సంబంధిత శాఖా మంత్రిని అయిన త‌న‌ను ప్రొటోకాల్ ప్ర‌కారం ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లేన‌ని పల్లె వాపోతున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంతే తాజాగా పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా తెల్ల రేషన్ కార్డులున్న క్రైస్తవ కుటుంబాలకు అందిస్తున్న చంద్రన్న కానుకల సంచీల ఫొటోల‌ను మంత్రి ప‌రిటాల సునీత‌ తాజాగా విడుద‌ల చేశారు. అయితే ఈ సంచిపై ఎక్క‌డ కూడా మైనార్టీ శాఖా మంత్రి అయిన ప‌ల్లె ఫొటో లేదు. ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రిగా ప‌రిటాల సునీత ఫొటో మాత్ర‌మే ఉంది. ఈ ప‌రిణామంతో ఖంగుతిన్న ప‌ల్లె వ‌ర్గీయులు వ‌రుస‌గా మూడో సారి త‌మ నాయ‌కుడిని ఇలా అవ‌మానించార‌ని అంటున్నారు. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రిగా సునీత ఫొటో ఉన్న‌పుడు... మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రిగా త‌మ నాయ‌కుడి ఫొటోను ఎందుకు ముద్రించ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇది వ‌రుస బెట్టి మూడో సారి అవ‌మానించ‌డమ‌ని మండిప‌డుతున్నారు.

ఇదిలాఉండ‌గా గ‌త ఏడాది అయితే ఏకంగా బ‌హిరంగ స‌భ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేసుకున్నారు. జిల్లాలో జ‌రిగిన సమావేశంలో పల్లె మాట్లాడుతూ...తెల్ల రేషన్ కార్డులున్న క్రైస్తవ కుటుంబాలకు అందిస్తున్న చంద్రన్న కానుకల సంచీపై తన చిత్రాన్ని ముద్రించకపోవడం వెనుక పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి ప‌రిటాల సునీత హస్తముందని ఆరోపించారు. తాను ఐటీ, మైనార్టీల‌ మంత్రి హోదాలో ఉన్నానని, జిల్లాకు చెందిన వాడినే అయినప్పటికీ తన చిత్రాన్ని ముద్రించలేదని ప‌ల్లె ఆక్షేపించారు. అయితే వేదిక‌పై చేసిన ఈ కామెంట్ల‌కు సునిత స్పందించ‌లేదు. కానీ స‌భ ముగిసిన అనంత‌రం అక్క‌డే ఉన్న పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూ ప‌ల్లె విమర్శలు పట్టించుకునే అవసరం లేదని సునీత వ్యాఖ్యానించడం గమనార్హం. అంత‌కుముందు గతంలో రంజాన్ కానుకలను రంజాన్ తోఫా పేరుతో ఇచ్చినప్పుడు సైతం బ్యాగులపై మైనార్టీ మంత్రి అయిన‌ పల్లె చిత్రం లేదు. మరోమారు ఇలా జరుగకుండా చూసుకుంటామని అప్పట్లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా అధికారులు ఆయనకు సర్ది చెప్పారు. తాజాగా మ‌రోమారు ఈ వివాదం తెర‌మీద‌కు రావ‌డం ప‌ట్ల తెలుగు త‌మ్ముళ్లు ఆవేద‌న చెందుతున్నారు.