Begin typing your search above and press return to search.

ఇక కుదరదు: చంద్రబాబుకు తెగేసి చెప్పిన పరిటాల శ్రీరామ్?

By:  Tupaki Desk   |   3 Sep 2020 3:45 AM GMT
ఇక కుదరదు: చంద్రబాబుకు తెగేసి చెప్పిన పరిటాల శ్రీరామ్?
X
రాష్ట్ర విభజనకు ముందు అనంతపురం లో జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల వర్గానికి ఏమాత్రం పొసగలేదు. విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో తప్పని పరిస్థితుల్లో జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి రాకను పరిటాల సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అనంతలో పార్టీ మరింతగా బలపడుతుందని, మీకు ఉండే ప్రాధాన్యత మీకు కచ్చితం గా ఉంటుందని సునీత కు అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమెను బుజ్జగించి, చివరకు ఒప్పించి, జేసీ సోదరులను పార్టీ లోకి తీసుకున్నారు. చంద్రబాబు చెప్పడంతో అంగీకరించినప్పటికీ సునీతకు, పరిటాల వర్గానికి వారి రాక ఏమాత్రం మింగుడు పడలేదు.

2019 ఎన్నికల్లో వైసీపీ హవా వీయడం తో జేసీ కుటుంబం, పరిటాల కుటుంబం ఎన్నికల్లో ఊడ్చిపెట్టుకు పోయాయి. ఆ ఎన్నికల తర్వాత పరిటాల ఫ్యామిలీ దూకుడు కాస్త తగ్గింది. జేసీ కుటుంబం ప్రారంభంలో కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ ఇటీవలి కాలంలో తగ్గిందనే చెప్పవచ్చు. ప్రతిపక్షంలోని కీలక నేతలను వైసీపీ టార్గెట్‌గా చేసుకున్నదనే వాదనలు ఉండటం వేరే విషయం. అనంతలో ముఖ్యంగా రాప్తాడు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబానిదే హవా. 2019లో ఇక్కడ పరిటాల ఫ్యామిలీకి చుక్కెదురు కావడానికి వైసీపీ హవా కంటే జేసీ కుటుంబంతో కలవడాన్నే ప్రజలు ఎక్కువగా జీర్ణించుకోలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ వైసీపీ గెలిచిన తర్వాత పట్టు పెంచుకోవడానికి, తద్వారా పరిటాల కుటుంబం ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారట. దీనికి తోడు జేసీతో కలవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోవడంతో పరిటాల శ్రీరామ్ గ్రామాల్లో పట్టుకోల్పోతున్నారని అంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే మీరు మీరు ఒకటి (జేసీ, పరిటాల ఫ్యామిలీ) పెద్దవాళ్లు ఒక్కటవుతారని, మేం మాత్రం నష్టపోవాలా అని కార్యకర్తలు శ్రీరామ్‌ ను సూటిగా ప్రశ్నిస్తున్నారట. ప్రజల్లో ఆవేదనను గ్రహించిన పరిటాల శ్రీరామ్ అధినేత కు ఇదే విషయాన్ని చెప్పారట.

జేసీ కుటుంబం, తాము ఒకే పార్టీలో ఉంటే ప్రజలు జీర్ణించుకోవడం లేదని, సూటిగా నిలదీస్తున్నారని, వాళ్లకు, మాకు పొసగదని తేలిపోయిందని, గత ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణం జగన్ కంటే జేసీతో కలిసి ఒకే పార్టీలో ఉండటమేనని, ఎవరో ఒకరమే పార్టీలో ఉండగలమని, మీరే తేల్చుకోవాలని పరిటాల శ్రీరామ్.. చంద్రబాబుకు తెగేసి చెప్పారట. మరోవైపు, జేసీ కుటుంబానికి అప్పటి వరకు అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం టీడీపీలో చేరిన తర్వాత దూరమైందట. దీంతో వారు దెబ్బతిన్నారు. అనంతలో ఈ పరిణామం టీడీపీకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.