తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవీంద్ర - ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సునీత దంపతుల ఇంట పెళ్లి బాజాలు మోగాయి. పరిటాల రవి - సునీతల రెండో కుమారుడు పరిటాల సిద్ధార్థ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు - బంధువులు - స్నేహితుల మధ్య తేజస్వినితో సిద్ధార్థ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వివాహం సందర్భంగా పరిటాల కుటుంబంలో పండుగ వాతావరణం ఏర్పడింది. సిద్ధార్థను పెళ్లికుమారుడిని చేయటం - పెళ్లి పందిరికి తీసుకుని వెళ్లడం వంటి కార్యక్రమాలను శాస్ర్తోత్తంగా చేపట్టారు. సిద్ధార్థను ఆయన తల్లి సునీత - అన్న శ్రీరామ్ - వదిన జ్ఞాన ఆశీర్వదించారు. సిద్ధార్థ్ వివాహ వేడుకలను శ్రీరామ్ దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లికొడుకు అయిన సిద్ధార్థ్ ను సునీత - శ్రీరామ్ లు ఆశీర్వదిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని నసనకోట సమీపంలో ఉన్న తిరుమల దేవర ఆలయంలో వివాహ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ విందు కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సిద్ధార్థ వివాహ రిసెప్షన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - సినీనటుడు మోహన్ బాబు కుటుంబసభ్యులతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా వస్తారని పరిటాల కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ మంత్రులు - శాసన సభ్యులు - ఎమ్మెల్సీలు - టీడీపీ శ్రేణులు - పరిటాల అభిమానులు భారీ సంఖ్యలో ఈ రిసెప్షన్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. 30వేల మందికిపైగా ఈ వేడుకల్లో పాల్గొంటారని అంచనా. కాగా, సిద్ధార్ధ - తేజస్వినిల వివాహ నిశ్చితార్థ వేడుక ఇటీవల హైదరాబాద్ గండిపేట ప్రాంతంలోని రిధిరా రిట్రీట్ రిసార్ట్ లో జరిగింది. ఈ వేడుకకు నారా చంద్రబాబు ఫ్యామిలీ - ఇతర రాజకీయ నేతలు హాజరైన సంగతి తెలిసిందే.