Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ గుండుపై అప్ప‌ట్లో ప‌రిటాల ఏమ‌న్నారు?

By:  Tupaki Desk   |   10 Dec 2017 4:17 AM GMT
ప‌వ‌న్ గుండుపై అప్ప‌ట్లో ప‌రిటాల ఏమ‌న్నారు?
X
మీడియాను.. సోష‌ల్ మీడియాను మాత్ర‌మే కాదు.. స‌గ‌టు జీవి చెవిన పడి.. ఆస‌క్తిక‌రంగా ముచ్చ‌టించుకున్న అంశంగా పవ‌న్.. ప‌రిటాల పంచాయితీగా చెప్పాలి. ఇందులో ఏ మాత్రం నిజం లేకున్నా... ఏదేదో జ‌రిగిపోయిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అప్పుడెప్పుడో జ‌రిగిపోయిన ఈ విష‌యం ఇప్పుడెందుకు? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. తాజాగా ప‌వ‌న్ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. త‌న పార్టీ ఔత్సాహికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ.. ప‌రిటాల ర‌వి త‌న‌కు గుండు కొట్టించార‌న్న దుష్ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చారు.

తాను త‌మ్ముడు మూవీ షూటింగ్ లో ఉన్న‌ప్పుడు త‌న అన్న నాగ‌బాబు ఫోన్ చేసి.. ఎక్క‌డ ఉన్నావ‌ని ఆరా తీస్తే.. తాను బీహెచ్ ఈఎల్ త‌మ్ముడు షూట్ లో ఉన్న‌ట్లు చెప్పాన‌ని.. ఆయన మ‌ళ్లీ అడిగార‌న్న విష‌యాన్ని గుర్తుచేసుకున్నారు. తాను షూటింగ్ లో ఉన్న‌ట్లు చెప్పిన త‌ర్వాత‌.. త‌న‌కు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ వ‌చ్చింద‌ని.. త‌న‌ను ప‌రిటాల ర‌వి తీసుకెళ్లి కొట్టిన‌ట్లుగా స‌మాచారం ఇచ్చార‌న్నారు.

కొంద‌రు తెలుగుదేశం నాయ‌కులు కావాల‌ని మొద‌లెట్టిన విష ప్ర‌చారం పెరిగి.. పెరిగి పెద్ద‌దై.. రెండేళ్లు గ‌డిచేస‌రికి పేప‌ర్లో వార్త‌గా వ‌చ్చింద‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న జీవితంలో ప‌రిటాల ర‌విని క‌ల‌వ‌లేద‌ని స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్‌.. ప‌రిటాల ఎపిసోడ్ కేవ‌లం దుష్ప్ర‌చారం మాత్ర‌మేన‌ని చెప్పారు. ప‌రిటాల ఆత్మ‌క‌థ‌లోనూ త‌న ప్ర‌స్తావ‌న ఉంద‌ని.. త‌న‌ను క‌లిసిందే లేద‌న్న విష‌యాన్ని పేర్కొన్నార‌న్నారు.

ఇలా గ‌తంలో జ‌రిగిన విష‌యాల గురించి ప‌వ‌న్ వెల్ల‌డించిన వేళ‌.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన సీనియ‌ర్ పాత్రికేయుడు ఒక‌రు ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని వార్త రూపంలో వెల్ల‌డించారు. ప‌వ‌న్ గుండుపై ప‌రిటాల అప్ప‌ట్లో రియాక్ట్ అయ్యారంటూ గ‌తానికి సంబంధించిన విష‌యం గురించి చెబుతూ.. హైద‌రాబాద్ నుంచి కొంద‌రు సీనియ‌ర్ మీడియా మిత్రుల్ని అనంత‌పురంలోని త‌న స్వ‌గ్రామ‌మైన వెంక‌టాపురానికి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య చాలా విష‌యాలు వ‌చ్చాయి. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ గుండు వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని.. ఆ సంద‌ర్భంగా ప‌రిటాల ర‌వి రియాక్ట్ అవుతూ.. అందులో నిజం లేద‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ లో త‌న ఇంటిప‌క్క‌న ఉన్న స్థ‌లం కొనుగోలు చేయాల‌ని చిరంజీవి అనుకున్నార‌ని.. తాను వ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చాన‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. నాకు భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయి. నా కోసం వ‌చ్చిపోయే వాహ‌నాల‌ను మా వాళ్లు ఆరా తీస్తుంటారు. చిరంజీవి అక్క‌డ‌కు వ‌స్తే అది ఆయ‌న‌కు ఇబ్బందిగా ఉంటుంది. ఆయ‌న కోసం వచ్చే వారు కూడా ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది. అందుకే వ‌ద్ద‌న్నాను. ఆయ‌న కూడా ఆ స్థ‌లాన్ని తీసుకోలేదు. అదొక్క‌టి త‌ప్పించి చిరంజీవి కుటుంబంలోని ఎవ‌రితోనూ నాకు స‌మ‌స్య‌లు లేవు. పవన్ క‌ల్యాణ్ తో క‌నీసం ప‌రిచ‌యం కూడా లేదు. బ‌హుశా ప‌వ‌న్ తిరుమ‌ల‌కు వెళ్లి త‌ల‌నీలాలు ఇచ్చి ఉంటారు. అది తెలియ‌క గిట్ట‌నివాళ్లు ప్ర‌చారం చేసి ఉంటారు" అని త‌న‌తో చెప్పిన‌ట్లుగా స‌ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వెల్ల‌డించారు. ఈ విష‌యం వార్త‌గా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో ప‌బ్లిష్ అయ్యింది. ప‌వ‌న్ చెప్పిన మాట‌కు అచ్చుగుద్దిన‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న‌కు కులాన్ని అపాదించారంటూ ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌పై ప‌వ‌న్ క‌స్సుమ‌న్నారో.. ఇప్పుడు అదే మీడియా సంస్థ‌లో తాజా వార్త ప‌బ్లిష్ కావ‌టం విశేషంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. త‌న‌పై క‌స్సుమ‌న్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స‌ద‌రు మీడియా అధినేత తన వారాంతం కామెంట్లో రియాక్ట్ అయిన రోజే.. ఈ వార్త ప‌బ్లిష్ అయ్యింది.