Begin typing your search above and press return to search.

ఫ్యూచ‌ర్ కార్ల‌ను చూపించిన పారిస్ షో!

By:  Tupaki Desk   |   3 Oct 2018 5:20 AM GMT
ఫ్యూచ‌ర్ కార్ల‌ను చూపించిన పారిస్ షో!
X
క‌ల‌లో కూడా ఊహించ‌ని డిజైన్లు క‌ళ్ల ముందు క‌నువిందు చేస్తే.. అవాక్కు కావ‌టానికి మిన‌హా మ‌రింకేం ఉంటుంది. ఇప్పుడున్న కార్ల‌కు కొత్త రూపు ఇస్తూ.. భ‌విష్య‌త్ ఇంధ‌నంగా చెబుతున్న విద్యుత్ కార్ల‌ను తెర మీద‌కు తెచ్చేందుకు ప‌లు కంపెనీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్న వేళ‌.. వారి ఆలోచ‌న‌ల‌కు వంద‌ల కిలోమీట‌ర్ల ముందు ఉన్నామ‌న్న విష‌యాన్ని చెప్పేస్తూ.. ప‌లు కంపెనీలు స‌రికొత్త మోడ‌ళ్ల‌లో వ‌చ్చేశాయి.

పారిస్ లో నిర్వ‌హించిన కార్ల షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫ్యూచ‌ర్లో రోడ్ల మీద ఎలాంటి కార్లు ప‌రుగులు తీస్తాయ‌న్న దానికి శాంపిల్ గా తాజా షో సాగింది. తాజా షో స్పెష‌ల్ ఏమంటే.. విద్యుత్ కార్లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఈ కార్ల‌ను ప్ర‌ఖ్యాత కార్ల కంపెనీలు ఆడి.. మెర్సిడెస్ బెంజ్ లు తీసుకొచ్చిన మోడ‌ళ్లు షోలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారాయి.

ప్ర‌స్తుతం మీడియాకు.. వాణిజ్య ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే అనుమ‌తిచ్చే ఈ షోలో ఏర్పాటు చేసిన కార్ల‌ను చూసేందుకు సామాన్యుల‌కు గురువారం నుంచి అనుమ‌తించ‌నున్నారు. షోలో ప్ర‌ముఖంగా నిలిచిన టాప్ ఫోర్ వెహ‌కిల్స్.. వాటి ప్ర‌త్యేక‌త‌ను చూస్తే..

1. భ‌విష్య‌త్ కారుగా అభివ‌ర్ణిస్తున్న రెనో ఈజ‌డ్ అల్టిమో ప‌లువురి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. షోలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారిన ఈ కారును పూర్తిగా విద్యుత్ కారు కావ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. కొత్త త‌రం ఇన్ఫోటైన్ మెంట్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీని ధ‌ర‌ను ఉత్ప‌త్తిదారులు వెల్ల‌డించ‌లేదు.

2. మెర్సిడెస్ బెంజ్ కు చెందిన ఈ కారును విజ‌న్ ఈక్యూ సిల్వ‌ర్ గా పిలుస్తున్నారు. ఒకే ఒక్క సీటు ఉన్న ఈ ఖ‌రీదైన కారు కూడా పూర్తిగా విద్యుత్ ఆధారంగానే న‌డుస్తుంద‌ని త‌యారీదారులు చెబుతున్నారు. ఈ కారును 1937లో త‌యారు చేసిన ఒక సీటు కారు స్పూర్తిగా తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. దీని ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌లేదు.

3. ప్ర‌ఖ్యాత కార్ల కంపెనీల్లో ఒక‌టైన బుగాటీ చిరాన్ రూపొందించిన కారు షోలో అంద‌రిని క‌ట్టి ప‌డేస్తోంది. దీని ఉత్ప‌త్తిదారైన డానిష్ కంపెనీ ప్ర‌కారం దీని ధ‌ర సుమారు రూ.42.68 కోట్లుగా చెబుతున్నారు. 2.4 సెక‌న్ల వ్య‌వ‌ధిలో 0-160 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకోగ‌ల‌టం ఈ కారు ప్ర‌త్యేక‌త‌.

4. మూడంటే మూడు సెక‌న్ల వ్య‌వ‌ధిలో గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లే కారుగా లోట‌స్ ఎక్సిజ్ స్పోర్ట్స్ ను చెబుతున్నారు. పారిస్ షోలో అంద‌రి దృష్టిలో ప‌డ్డ ఈ కారు గ‌రిష్ఠ వేగం గంట‌ల‌కు 233 కి.మీ. దీని ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌లేదు.