Begin typing your search above and press return to search.

సొంతోళ్లు హ్యాండ్ ఇస్తున్న వేళ జగన్ కు పెద్ద రిలీఫ్

By:  Tupaki Desk   |   9 May 2016 5:34 AM GMT
సొంతోళ్లు హ్యాండ్ ఇస్తున్న వేళ జగన్ కు పెద్ద రిలీఫ్
X
వరుస పెట్టి ఒకరు తర్వాత ఒకరుగా జంప్ అయిపోతూ అధినేతకు షాకుల మీద షాకులు ఇస్తున్న ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు తెలిసిందే. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ 17 మంది ఏపీ అధికారపక్షమైన టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం.. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి జగన్ కు హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేయటం తెలిసిందే. ఇలా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో ఇబ్బంది పడుతున్న జగన్ కు ఒక పెద్ద రిలీఫ్ లాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఏ కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలు తనకు హ్యాండ్ ఇచ్చి బాబు చెంతకు వెళ్లిపోయారో.. అదే జిల్లాకు చెందిన ఒక నేత జగన్ చెంతకు చేరటం ఆసక్తికరంగా మారింది. ఆ మధ్యన కర్నూలు జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ జగన్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవటం తెలిసిందే. మణిగాంధీ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ తాజాగా జగన్ పార్టీలో చేరారు. కోట్ల కుటుంబానికి నమ్మినబంటు లాంటి మురళీకృష్ణ తాజాగా జగన్ పార్టీలో చేరటం ఆసక్తికరంగా మారింది.

తన పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసపెట్టినట్లుగా పార్టీ వదిలిపెట్టి వెళుతున్న వేళ.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోజగన్ తప్ప వేరే నాయకుడే ఉండకుండా చేస్తామని.. జగన్ పార్టీ ఖాళీ అవుతుందని ఏపీ అధికారపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. మాజీ ఎమ్మెల్యే ఒకరు వచ్చి పార్టీలో చేరటం జగన్ కు పెద్ద రిలీఫ్ గా చెప్పాలి. ఈ కారణంగానే.. ఆయన పార్టీలో చేరటాన్ని స్వాగతిస్తూ.. జగన్ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికి.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా రాజకీయ పరిణామం జగన్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.