Begin typing your search above and press return to search.

నేరం చేసి సారీ అని ట్వీట్ చేసిన ఎంపీ

By:  Tupaki Desk   |   25 April 2016 4:35 PM GMT
నేరం చేసి సారీ అని ట్వీట్ చేసిన ఎంపీ
X
ఒకే రోజు వెలుగు చూసిన రెండు సంఘటనలు చూసినప్పుడు రూలర్స్ బేఫికర్ గా.. రూల్ బ్రేకర్స్ గా మారుతున్న వైనం షాకింగ్ గా అనిపించాల్సిందే. బ్యాంకుల దగ్గర రూ.9వేల కోట్ల అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా.. చెప్పాపెట్టకుండా దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా ఎంత పెద్ద మోసగాడన్న విషయం ఆయన బ్రిటీష్ పౌరసత్వం చెప్పేస్తుంది. దశాబ్దాల క్రితమే బ్రిటీష్ పౌరుడిగా మారిపోయిన తర్వాత కూడా రాజ్యసభలోకి దర్జాగా అడుగుపెట్టిన వైనం చూసినప్పుడు ఓపట్టాన మింగుడుపడని రీతిలో మారింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సరి.. బేసి విధానాన్ని ఒక బాధ్యత కలిగిన ఎంపీ బ్రేక్ చేయటమే కాదు.. ఏకంగా పార్లమెంటులోకి వచ్చేసిన వైనం చర్చనీయాంశంగా మారింది.

సోమవారం నుంచి షురూ అయిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ కమ్ సినీనటుడు పరేశ్ రావల్ తన కారు (డీఎల్9 సీఏ 1914)ను పార్లమెంటు భవనంలోకి తీసుకొచ్చిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సరి.. బేసి విధానంలో ఈ రోజు ఢిల్లీలో వినియోగించాల్సిన వాహనాల చివరి అంకె బేసి సంఖ్యతో ఉండాలి. కానీ.. ఇదేమీ పట్టించుకోని పరేశ్ రావెల్ తన కారును తీసుకొచ్చి పార్లమెంటు హౌస్ లో నిలిపి లోపలకు వెళ్లిపోయారు.

రూల్స్ ను బ్రేక్ చేసిన పరేశ్ వైఖరిపై పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తప్పు చేసిన ఎంపీని మీడియా చుట్టూ చేసి.. సరి బేసి గురించి.. రూల్స్ ను బ్రేక్ చేసిన వైనాన్ని ప్రశ్నిస్తే.. సూటిగా సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోయారు. ఇలా లోపలికి వెళ్లిన పరేశ్ రావెల్ కు ఏమైందో కానీ.. చేసిన తప్పు ఎంత పెద్దదన్న విషయం గుర్తుకు వచ్చినట్లుగా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. తాను పెద్ద నేరం చేశానని.. తనను క్షమించాలని కోరుతూ ట్వీట్ చేయటం గమనార్హం. చేయాల్సిన నేరం చేసేసి.. సింఫుల్ గా సారీ చెప్పేస్తే సరిపోతుందా?