Begin typing your search above and press return to search.

వీళ్లేం తల్లిదండ్రులు? లవ్ మ్యారేజ్ చేసుకుందని శ్రద్దాంజలి ఫోటో పోస్టర్

By:  Tupaki Desk   |   4 July 2023 9:45 AM GMT
వీళ్లేం తల్లిదండ్రులు? లవ్ మ్యారేజ్ చేసుకుందని శ్రద్దాంజలి ఫోటో పోస్టర్
X
కాలం మారింది. మనుషులు.. మనసులు మారుతున్నాయి. అభిప్రాయాల్లోనూ విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇలాంటి వేళలో.. ప్రేమ పెళ్లిళ్ల మీద గతంలో మాదిరి అభ్యంతరాలు ఉండటం లేదు. చాలా అరుదుగా మాత్రమే అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరాలు వ్యక్తం చేయటం.. తాము ఒప్పుకోమని కరాఖండిగా తేల్చి చెప్పే తల్లిదండ్రులు ఒక మోస్తరుగానే ఉంటున్నారు.

దీనికి కారణం.. పిల్లలు కూడా తమ ప్రేమపెళ్లిళ్ల విషయంలో ఆచితూచి (అందరు అని చెప్పలేం కానీ.. చాలామంది) అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. దీంతో.. పలువురు మొదట్లో కాస్తంత అభ్యంతరం చెప్పినా.. వెయిట్ చేస్తూ.. తమ ప్రేమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శిస్తున్న వారిని కొన్ని కుటుంబాలు ఓకే చేస్తున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో కూతురు ప్రేమపెళ్లి చేసుకుందున్న కోపంతో పేరెంట్స్ వ్యవహరించిన తీరు షాకింగ్ గానే కాదు.. పలువురు తిట్టిపోసేలా మారింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతం చూస్తే.. ప్రేమ పెళ్లి విషయంలో మరీ ఇంత అతిగా స్పందించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.

కుమార్తె బతికి ఉండగానే.. శ్రద్దాంజలి అంటూ పోస్టర్స్ ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పెళ్లి కుమార్తె డాక్టర్ అయినప్పటికీ.. ఆమె తండ్రి మాత్రం అందుకు భిన్నంగా కుమార్తె ప్రేమ విషయంలో ఇంత కర్కశంగా ఉండటమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

పెద్దలు ఒప్పుకోని కారణంగా పెళ్లి చేసుకున్న జంటలో.. వధువు డాక్టర్ గా పని చేస్తుంటే.. వరుడు కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే.. ఇరు కుటుంబాలను ఒప్పించాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ఇరు కుటుంబాల వారిని ఎదిరించిన ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

తమ మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. తమ కుమార్తె మరణించిందని పేర్కొంటూ.. శ్రద్దాంజలి పోస్టర్ ను వేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ పోస్టర్ వ్యవహారం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పలువురు ఈ చర్యను ఖండిస్తున్నారు. ఈ పోస్టర్ ఉదంతంలో ఈ జంట పోలీసుల్ని ఆశ్రయించి.. తమ ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో.. తల్లిదండ్రుల్ని పిలిపించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.