Begin typing your search above and press return to search.

క‌రోనా ఎఫెక్ట్‌: అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే అక్షింత‌లు

By:  Tupaki Desk   |   6 Sep 2021 4:30 PM GMT
క‌రోనా ఎఫెక్ట్‌: అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే అక్షింత‌లు
X
`పెళ్లంటె.. పందిళ్లు.. సంద‌ళ్లు.. త‌ప్పెట్లు.. తాళాలు.. త‌లంబ్రాలూ..` అనే మాట‌.. క‌రోనా ఎఫెక్ట్‌తో మారిపోయింది. ఇప్పుడు పెళ్లంటే.. ఆన్‌లైన్‌లో వీక్షించ‌డం.. ఆన్‌లైన్‌లోనే అక్షింత‌లు వేసి ఆశీర్వ‌దించ‌డం అనే మాట వినిపిస్తోంది. ఓ వంద మందిని పిలిచి భోజ‌నాలు పెట్టే ప‌రిస్థితి.. బంధువుల‌ను క‌లుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీనికి కార‌ణం.. క‌రోనా ఎక్క‌డ విజృంభిస్తుందో అన్న భ‌యం.. మ‌రోవైపు..క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు వెర‌సి.. పెళ్లి సంద‌డి స్వ‌రూపం.. మారిపోయింది. వివాహం అంటే.. బంధువులు, ఆహ్వానితులు, స్నేహితుల సంద‌డి. వ‌చ్చేవారు..వెళ్లేవారు.. సంబ‌రాలు.. చిన్నారుల ఆట‌పాట‌లు.. చుట్టాల గిల్లిక‌జ్జాలు.. ఏ కుటుంబంలో అయినా అదో పెళ్లి సండ‌ది!

ముఖ్యంగా తెలుగు లోగిళ్ల‌లో జ‌రిగే.. పెళ్లిళ్ల‌కు వంద‌ల సంఖ్య‌లో ఆహ్వానితులు వ‌స్తారు. కుటుంబాల నుంచి దూరా భారం కూడా లెక్క‌చేయ‌కుండా.. రెండు మూడు రోజుల పాటు పెళ్లివారింట్లో మ‌కాం వేసి మ‌రీ .. ఆనందాన్ని పంచుకుంటారు. ఇటు పిలిచిన వారికి, అటు వ‌చ్చే వారికి కూడా పెళ్లి.. ఓ గొప్ప పండ‌గే! కానీ, క‌రోనా కార‌ణంగా.. పెళ్లి సంద‌ళ్లు క‌నుమ‌రుగ‌య్యాయి. పిలిచినా వెళ్లేందు.. పిలిచేందుకు కూడా.. జంకుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. వివాహానికి వ‌చ్చే వారిలో ఏ ఒక్క‌రికి పాజిటివ్ ల‌క్షణాలు ఉన్నా.. అంద‌రికీ వ్యాపించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆంక్ష‌ల‌కుతోడు.. ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న భ‌యం కూడా పెళ్లిళ్ల‌ను ఏకాంతంగా నిర్వ‌హించుకునే దుస్థితిని తీసుకువ‌చ్చింది.

తాజాగా గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన వరుడు గ్రీష్మంత్ కు ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన వధువు అనుజ్ఞ వృత్తి రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి రెండు సంవత్సరాల క్రితం వివాహం కొరకు పెద్దలు నిశ్చయతాంబులాలు తీసుకున్నారు. అయితే వధూవరులిద్దరూ వృత్తి రీత్యా అమెరికా లో ఉంటున్నారు. వివాహం చేసుకోవాలని రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. థర్డ్ వేవ్ కరోనా నేపథ్యంలో అబ్బాయి, అమ్మాయి భారత్ కు వచ్చే పరిస్థితులు లేకపోయాయి. దీంతో ఇద్దరు తమ త‌ల్లిదండ్రుల ఆశీస్సులు ఆన్ లైన్ లో తీసుకుని అనుకున్న ముహుర్తానికి ఆమెరికాలోని డల్లాస్ లో పెళ్లి చేసుకున్నారు.

ఈ వివాహనికి హజరు కాలేని కుటుంబ సభ్యులు, బంధువులు విన్నూత తరహాలో పెళ్లి వేడుకలను తిలకించేందుకు పట్టణం లోని జయకృష్ణ అపార్ట్ మెంట్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి వివాహ వేడుకలు తిలకించి నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. తెలుగు సంప్ర‌దాయానికి దూరంగా.. కాబోయే అల్లుడి కాళ్లు క‌డ‌గ‌డం.. వియ్యంకులు బ‌ట్టలు మార్చుకోవ‌డం.. పెళ్లి కుమార్తెను బుట్ట‌లో తీసుకురావ‌డం వంటివి లేకుండానే జ‌రిగిపోయిన ఈ వివాహం.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.