Begin typing your search above and press return to search.

ఏపీ : రియల్ ఎలక్షన్స్ ను తలదన్నేలా పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్‌

By:  Tupaki Desk   |   22 Sep 2021 4:30 PM GMT
ఏపీ : రియల్ ఎలక్షన్స్ ను తలదన్నేలా పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్‌
X
ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎలక్షన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా , ఒకరకంగా చెప్పాలంటే , రియల్ ఎలక్షన్స్ ను తలదన్నేలా పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్‌ జరిగాయి. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏర్పాటు కోసం కమిటీల ఎన్నికలో కూడా రాజకీయ రంగు పులుముకుంది. చివరకు ఈ ఎన్నికలో కూడా డబ్బు పంచుతున్నారనే విమర్శలు, పార్టీల మధ్య ఆధిపత్యపోరు స్పష్టంగా కనిపించింది. పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో, మళ్లీ ఏపీలో ఎన్నికల హడావుడి ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఇదేంటి ఇప్పడేం ఎన్నికలు అని ఆశ్చర్యపోకండి. ప్రభుత్వ పాఠశాల్లో పేరెంట్స్‌ కమిటీలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు విద్యా కమిటీలను ఎన్నుకునే కార్యక్రమం చేపట్టారు. ఇందులో కూడా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో విద్యా కమిటి చైర్మన్ ఎన్నిక విషయంలో వైసీపీ, టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇరువర్గాల ఆధిపత్య పోరు కాస్తా రాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి, గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఆ తర్వాత, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అయితే స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. పెద్ద చెప్పలి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాకమిటి ఎన్నికలలో వైసీపీ, నాయకులు గొడవపడ్డారు. టీడీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో వైసీపీకి చెందిన నాయకులు దాడి చేశారు. విద్యార్థుల తల్లదండ్రులతో మాట్లాడుతున్నానని చెబుతున్నా వినిపించుకోకుండా దాడి చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాలకు సర్ధి చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎంపిక దగ్గర ఈ వివాదం అందర్ని ఆశ్చర్యపడేలా చేసింది. ఇరువర్గాలు తగాదా పెట్టుకొని గ్రామ సర్పంచ్‌ హరినాధ్‌ని దుర్భాషలాడారు. తనపై నోరు పారేసుకున్నారని సర్పంచ్‌ స్కూల్‌ ముందు భైటాయించడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. ఇక్కడ కూడా పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. విద్యా కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కూడా రాజకీయ పదవులుగా భావించడం వల్లే పలుచోట్ల ఘర్షణలు, దాడులు జరిగాయి.