Begin typing your search above and press return to search.

పిల్ల‌ల చ‌దువుల కోసం ఎంత ఖ‌ర్చో తెలుసా?

By:  Tupaki Desk   |   4 July 2017 12:30 AM GMT
పిల్ల‌ల చ‌దువుల కోసం ఎంత ఖ‌ర్చో తెలుసా?
X
ఓ ఆస‌క్తిక‌ర అధ్య‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పిల్ల‌ల స్కూల్ చ‌దువుల కోసం త‌ల్లిదండ్రులు పెడుతున్న ఖ‌ర్చుకు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ లెక్క వింటే నోటి వెంట మాట రాని ప‌రిస్థితి. భార‌త‌దేశంలో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల ప్రాధ‌మిక పాఠ‌శాల నుంచి ప్ల‌స్ టూ వ‌ర‌కూ చేస్తున్న ఖ‌ర్చు లెక్క విన్నంత‌నే నిజ‌మా? అంత ఖ‌ర్చు చేస్తున్నారా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

ప్రాధ‌మిక పాఠ‌శాల నుంచి ప్ల‌స్ టూ వ‌ర‌కూ చేస్తున్న యావ‌రేజ్ ఖ‌ర్చు ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.12.22 ల‌క్ష‌లు. అయితే.. ఈ మొత్తం ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే చాలా త‌క్కువ‌ని హెచ్ ఎస్‌ బీసీ చేసిన ద వ్యాల్యూ ఎడ్యుకేష‌న్ సిరీస్ హ‌య్య‌ర్ అండ్ హ‌య్య‌ర్ పేర్కొంది.

తాజాగా తేల్చిన ఖ‌ర్చులో ట్యూష‌న్ ఫీజులు.. పుస్త‌కాలు.. ర‌వాణా.. వ‌స‌తి అన్నీ ఖ‌ర్చులూ ఉన్నట్లుగా తెలిపింది. భార‌త్ లో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల చ‌ద‌వు కోసం తమ జీతాల నుంచి ఖ‌ర్చు పెట్టే వారు 59 శాతం మంది ఉన్న‌ట్లుగా తేల్చారు. మ‌రో 32 శాతం మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల చ‌దువు కోసం అద‌న‌పు గంట‌లు ప‌ని చేసి మ‌రీ సంపాదిస్తున్న‌ట్లుగా తేల్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పిల్ల‌ల చ‌దువు కోసం త‌ల్లిదండ్రులు పెట్టే ఖ‌ర్చు జాబితాలో చూస్తే.. తొలి స్థానంలో హాంకాంగ్ పేరెంట్స్ నిలుస్తారు. అంద‌రి కంటే అత్య‌ధికంగా వారు స‌గ‌టున రూ.85.42 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌ర్వాతి స్థానాల్లో యూఏఈ త‌ల్లిదండ్రులు రూ.64.22 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తుండ‌గా.. సింగ‌పూర్ త‌ల్లిదండ్రులు రూ.45.85 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు.

ఈ జాబితాలో భార‌త్ త‌ల్లిదండ్రులు 13వ స్థానంలో నిలుస్తున్నారు. ఇక‌.. ఈ జాబితాలో చివ‌ర ఉన్న దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. భార‌త్ తో పాటు 15 దేశాల‌కు చెందిన 8వేల మందికి పైగా త‌ల్లిదండ్రుల నుంచి సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం ఈ జాబితాను త‌యారు చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్లో నెల‌కొన్న పోటీ నేప‌థ్యంలో చ‌దువు కీల‌కంగా మారింద‌ని.. దీన్ని గుర్తించిన త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు అత్యుత్త‌మ ఉద్యోగాల్లో స్థిర‌ప‌డాల‌ని ఆశిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. పిల్ల‌ల చ‌దువుల కోసం త‌ల్లిదండ్రులు త‌మ వ్య‌క్తిగ‌త‌.. జీవ‌న‌శైలి.. ఆర్థిక త్యాగాలు చేసి మ‌రీ పిల్ల‌ల్ని చ‌దివిస్తున్న‌ట్లుగా ఈ అధ్య‌య‌నం తేల్చింది. ఇదిలా ఉండ‌గా.. భార‌త్ లోని ప్ర‌తి ప‌ది మంది పేరెంట్స్ లో తొమ్మిది మంది త‌మ పిల్ల‌ల్ని పీజీ చేయించాల‌ని బ‌లంగా భావించ‌ల‌మే కాదు.. అందుకు త‌గిన నిధుల్ని స‌మ‌కూర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/