Begin typing your search above and press return to search.

అప్పుడు ప‌నామా!... ఇప్పుడు ప్యార‌డైజ్‌!

By:  Tupaki Desk   |   6 Nov 2017 8:03 AM GMT
అప్పుడు ప‌నామా!... ఇప్పుడు ప్యార‌డైజ్‌!
X

ప‌నామా పేప‌ర్స్ అంటూ అప్పుడెప్పుడో వెలుగుచూసిన జాబితా న‌ల్ల కుబేరుల గుండెల్లో గుబులు పుట్టించిన విష‌యం తెలిసిందే. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెల్ల‌డించిన ఆ పేప‌ర్లు... ఒక్క న‌ల్ల కుబేరుల‌నే కాకుండా స‌మాజంలో గౌరవ‌ప్ర‌ద‌మైన స్థానాల్లో ఉన్న వ్య‌క్తుల‌కు చెందిన గుట్టును కూడా విప్పేసింది. ఆ పేప‌ర్ల పుణ్య‌మా అని అప్ప‌టిదాకా స‌చ్ఛీలుడిగానే కొన‌సాగిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ - ఆయ‌న కోడ‌లు ఐశ్య‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ ల‌పైనా మ‌ర‌క ప‌డిపోయింది. భార‌త గ‌డ్డ‌పై సంపాదించిన సొమ్ముకు సంబంధించిన ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నును ఎగ‌వేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకున్న బ‌డా బాబులు త‌మ సంప‌ద‌ను విదేశాల‌కు త‌ర‌లించేశారు. ఇలా విదేశాల‌కు త‌ర‌లించిన ల‌క్ష‌లాది కోట్ల నిధుల‌తో ఆయా దేశాల్లో వారు ఎంచ‌క్కా వ్యాపారాలు చేసుకోవ‌డంతో పాటుగా అదే డ‌బ్బును ఇత‌ర మార్గాల్లో మ‌ళ్లీ త‌మ ఖాతాల్లోకి మ‌ళ్లించేసుకున్నారు. నాడు ఆ పేప‌ర్లు వెల్ల‌డించిన ఈ సంచ‌ల‌న విష‌యాల‌తో దేశం మొత్తం ఓ భారీ కుదుపున‌కే గురైంద‌ని చెప్పాలి. ప‌నామా పేప‌ర్ల‌లో నాడు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వారు ఏ ఒక్క రంగానికి చెందిన వారో కాదు... అన్ని రంగాల‌కు చెందిన వారు కూడా ఆ జాబితాలో ఉన్న‌ట్లుగా తేలింది.

తాజాజా ప‌నామా పేప‌ర్స్ లాగానే ప్యార‌డైజ్ పేప‌ర్స్ పేరిట మ‌రో సంచ‌ల‌న జాబితా విడుద‌లైపోయింది. ఈ జాబితా కూడా న‌ల్ల‌ధ‌నాన్ని గుట్టుగా పోగేసిన వారికి చెందిన‌దే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితా ఒక్క భార‌త్‌ నే కాకుండా ప్ర‌పంచంలోని 180 దేశాల‌కు చెందిన బ‌డా బాబుల‌కు చెందిన గుట్టును ర‌ట్టు చేసేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌నామా పేప‌ర్ల‌ను విడుద‌ల చేసిన ఐసీఐజేనే ఈ జాబితాను కూడా విడుద‌ల చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలోని ఇత‌ర దేశాల‌కు చెందిన న‌ల్ల కుబేరుల విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెడితే.. మ‌న దేశానికి చెందిన వారు ఈ జాబితాలో 714 మంది ఉన్నార‌ట‌. ఇక జాబితాలో అత్య‌ధిక సంఖ్య‌లో న‌ల్ల కుబేరులున్న దేశాల వ‌రుస క్ర‌మంలో భార‌త్ 19 స్థానంలో ఉన్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వానికి క‌ట్టాల్సిన‌ పన్నుల నుంచి తప్పించుకునేందుకు బడా బాబులు - కంపెనీలు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో చాలా వివ‌రంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

పనామా పేపర్స్ కుంభకోణంతో చాలా మంది త‌ల రాత‌లు మారిపోగా.. తాజా పారడైజ్ లీక్స్ వ్యవహారం ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్‌ బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన 'నేవిగేటర్ హోల్డింగ్స్'లో అతనికి వాటా ఉన్నట్టు వెల్లడించింది. పారడైజ్ లీక్స్ లో అమితాబ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రామానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మరుసటి సంవత్సరం 2002లో.. బెర్మడాకు చెందిన ఓ డిజిటల్ మీడియా కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నట్టు పారడైజ్ లీక్స్ లో వెల్లడైనట్టు సమాచారం. నిజానికి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులెవరైనా ఆర్బీఐ అనుమతి పొందాల్సిందే. బచ్చన్ - సిలికాన్ వాలీ వెంచర్ ఇన్వెస్టర్ నవీన్ చద్ద జాల్వా మీడియా లిమిటెడ్ లో జూన్ 19 - 2002లో షేర్ హోల్డర్స్ గా ఉన్నట్టు స‌మాచారం. బెర్ముడాలో 2002లో ప్రారంభమైన ఈ కంపెనీ 2005లో మూతపడినట్టు తెలుస్తోంది. బెర్ముడా కన్నా ముందు కాలిఫోర్నియాలో నలుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఇదే కంపెనీని జనవరి - 2000వ సంవత్సరంలో అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెర్మడాలోను ఏర్పాటు చేశారు. అయితే ఈ కంపెనీ కేవలం పేపర్స్ మీదనే చలామణి అయిందన్న ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో షేర్ హోల్డర్ గా ఉన్న అమితాబ్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకునే అవకాశాలున్నాయి.

సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జయంత్ సిన్హా పేరు కూడా పారడైజ్ పేపర్స్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది. లోక్‌ సభకు ఎంపిక కాకముందు ఓమిద్యార్ కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఉన్నారు. ఈ కంపెనీ అమెరికాలోని డి.లైట్ డిజైన్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. డి.లైట్ డిజైన్ అనే కంపెనీకి కూడా జయంత్ సిన్హా మేనెజింగ్ డైరెక్టర్ గా చేసినట్టు స‌మాచారం. కానీ 2014లోక్ సభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన డిక్లరేషన్ లో జయంత్ సిన్హా ఈ విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. ఆ తర్వాత లోక్ సభ సెక్రటేరియట్ కు గానీ ప్రధాని కార్యాలయానికి గానీ ఆయ‌న‌ ఆ వివరాలు అందించలేదు. ఇప్పుడు పారడైజ్ పేపర్స్ రూపంలో ఆ వివరాలు వెల్లడి కావడంతో.. వాటిని సీక్రెట్ గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, తనపై వస్తున్న ఆరోపణలను జయంత్ సిన్హా ఖండించారు. సంస్థలో తన లావాదేవీలన్ని పారదర్శకంగానే ఉన్నాయని, సంబంధిత అధికారులకు డాక్యుమెంట్స్ కూడా సమర్పించానని ఆయ‌న చెబుతున్నారు. ప‌నామా పేప‌ర్స్ పుణ్య‌మా అని చాలా మంది మిస్ట‌ర్ క్లీన్ ఇమేజీ ఉన్న ప్ర‌ముఖులు ఆరోప‌ణ‌ల సుడిగుండంలో ప‌డిపోగా... ఇప్పుడు ప్యార‌డైజ్ పేప‌ర్స్ ఎంత‌మంది బండారాన్ని బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.