Begin typing your search above and press return to search.

గుజరాత్ లోనూ పేపర్ లీకేజీ.. షాకిచ్చేలా ఆర్.నారాయణమూర్తి మాటలు

By:  Tupaki Desk   |   10 April 2023 2:42 PM GMT
గుజరాత్ లోనూ పేపర్ లీకేజీ.. షాకిచ్చేలా ఆర్.నారాయణమూర్తి మాటలు
X
ఆర్.నారాయణ మూర్తి. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణమిచ్చే మనిషి. 'టెంపర్' లాంటి సినిమాలో నటించాలని బ్లాంక్ చెక్ రాసిచ్చాడా దర్శకుడు పూరి జగన్నాథ్. కానీ తాను కమర్షియల్ చిత్రాల్లో నటించనంటూ భీష్మించుకు కూర్చొని మరీ సిద్ధాంతాలను నమ్ముతూ కష్టమైనా.. నష్టమైనా భరిస్తూనే ఉన్నాడు.

అలాంటి నారాయణమూర్తి తాజాగా తెలంగాణలో బయటపడ్డ 'పేపర్ లీకేజీ'పై స్పందించాడు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలను వెనకేసుకొస్తూ ఇక్కడ బీజేపీ యాగీకి కౌంటర్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.

స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం 'యూనివర్సిటీ'. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడాడు.

'యువత జాతి సంపద.. వారిని మనం కాపాడుకోవాలి. వారి మేధస్సు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కానీ పేపర్ లీకేజీ వల్ల యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పేపర్ లీకేజీ అంశం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్ , బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా గమనిస్తూనే ఉన్నాం. పేపర్ లీకేజీల వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంది ' అంటూ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణ మూర్తి మాటల్లో న్యాయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ లీకేజీలు సాగుతున్నాయన్న వాస్తవం మనం గుర్తించాలి. కానీ తెలంగాణలో లీకేజీపై బీజేపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు, ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోవాలి.? అన్నది ఆలోచించాలి.

ఈ అంశాల చుట్టూనే 'యూనివర్సిటీ' అనే సినిమా తీశారు. విద్య, వైద్య, విమానయానం, బ్యాంకింగ్, రైల్వేస్ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ జరుగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటి వల్ల మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల వారు రిజర్వేషన్లను కోల్పోయి, ఉపాధి దక్కని పరిస్థితులు ఉండొచ్చు. ఈ అంశాలను హైలెట్ చేస్తూ నారాయణమూర్తి సంధించే ఈ చిత్రం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.