Begin typing your search above and press return to search.

60 జీబీల డేటా.. పేపర్ లీకేజ్ ఘటనలో విస్తుపోయే నిజాలు

By:  Tupaki Desk   |   17 March 2023 12:02 PM GMT
60 జీబీల డేటా.. పేపర్ లీకేజ్ ఘటనలో విస్తుపోయే నిజాలు
X
టీఎస్.పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. నిరుద్యోగుల పొట్టకొట్టే ఇలాంటి చర్యలపై 'ఇప్పటికే 'సిట్' దర్యాప్తునకు ఆదేశించింది. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక నిందితుడు , టీఎస్.పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది.

ప్రవీణ్ నాలుగు పెన్ డ్రైవ్ లలో 60-70 జీబీల సమాచారం ఉన్నట్టు విచారణలో తేలింది. దాన్ని విశ్లేషించడంతోపాటు తొలగించిన సమాచారాన్ని తిరిగి రాబట్టడంపై దృష్టి సారించారు. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో కీలక సమాచారం సిట్ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది.

సీజ్ చేసిన పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్, సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్.ఎస్ఎల్)కు పంపిన సిట్.. వాటిలోని ప్రాథమిక సమాచారాన్ని బట్టి ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.

విచారణలో ఇప్పటివరకూ ఏఈ సివిల్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీవో) ప్రశ్నపత్రాలు మాత్రమే లీకైనట్లు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్, ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ప్రశ్నపత్రాలూ టీఎస్.పీఎస్సీ నుంచి బయటకు వెళ్లాయనే ఆధారాలు సిట్ కు లభ్యమైనట్లు గురువారం విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రవీణ్ పెన్ డ్రైవ్ లలో వాటి సమాచారముందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు, కీలు, సమాధానాలతో కూడిన సమాచారంతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన ప్రశ్నపత్రాల ఫోల్డర్లనూ ప్రవీణ్ తస్కరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో టీఎస్.పీఎస్సీ పరీక్షల భవితవ్యాన్ని ఎఫ్.ఎస్.ఎల్ నివేదిక తేల్చనుందని భావిస్తున్నారు. లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారం కావడంతో 'సిట్' ఆచితూచి ముందుకెళుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.