Begin typing your search above and press return to search.

ఆమె బీజేపీ, అతను కాంగ్రెస్, కొడుకు వైసీపీ..ఇదేనా రాజకీయం!

By:  Tupaki Desk   |   1 March 2019 7:42 AM GMT
ఆమె బీజేపీ, అతను కాంగ్రెస్, కొడుకు వైసీపీ..ఇదేనా రాజకీయం!
X
రాజకీయాల్లో రక్తసంబంధీకులు వేర్వేరు పార్టీల్లో ఉండటాన్ని చూస్తూనే ఉన్నాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు.. ఇలా బంధాలు, బంధుత్వాలు ఇంటి దగ్గరే వదిలిపెట్టి రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ ఉన్నారు అనేక మంది. అలా కొందరు సీరియస్ రాజకీయాలే చేస్తూ ఉన్నారు. అన్నను ఓడించడానికి తమ్ముడు, తమ్ముడిని ఓడించడానికి అన్నలు కష్టపడుతున్న రాజకీయాలు ఏపీలో సాగుతూ ఉన్నాయి. వాటన్నింటి కన్నా భిన్నంగా ఉంది దగ్గుబాటి వారి రాజకీయం. ఇప్పటికే వివిధ పార్టీలు మారిన వీరి రాజకీయం ఇప్పుడు.. మరో రీతిన సాగుతూ ఉంది.

దగ్గుబాటి కుటుంబ రాజకీయం గురించి సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు దగ్గుబాటి హితేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విశేషం ఏమిటంటే ఆయనను వైఎస్ ఆర్సీపీలోకి చేర్చడానికి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీలోకి చేరలేదట. కేవలం కొడుకు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టు అట. వెంకటేశ్వరరావు మాత్రం చేరలేదు అట. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉండే వారు. మరి ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్టేనా.. లేక రాజకీయాలతో సంబంధం లేనట్టా అనేది మాత్రం అంతుబట్టని అంశం.

ఇక దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ఎంచక్కా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు! తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కూడా ఆమె బీజేపీ నేతగానే కొనసాగుతూ ఉన్నారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారు!

ఇలా దగ్గుబాటి కుటుంబీకులు.. ఒక్కోరు ఒక్కో పార్టీ అన్నట్టుగా ఉంది రాజకీయం. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి హితేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయడం ఖాయమైంది. మరి పురందేశ్వరి కూడా పోటీలో ఉంటారా అనేది చర్చనీయాంశం అవుతుంది. లెక్క ప్రకారం చూస్తే పురందేశ్వరి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో రక్తసంబంధీకులు వేర్వేరు పార్టీల్లో ఉండటం కొత్త ఏమీ కాదు. అయితే ఇలా తల్లీ కొడుకు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తే అంతకన్నా చోద్యం ఉండదు. అందులోనూ భర్త రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ రాజకీయాలతో సంబంధం లేనట్టేనట.

ఈ రాజకీయాన్ని చూస్తే జనాలు ఏమైనా అనుకుంటారు.. ఎవరో ఒకరు వెనక్కు తగ్గడమో, అంతా ఒక చోట ఉండటమో చేయాలని దగ్గుబాటి కుటంబం భావిస్తున్నట్టుగా లేదు. ఏదో ఒక పార్టీ రూలింగ్ లోకి రాకపోదా.. తమ రాజకీయం సాగకపోదా. .. అన్నట్టుగా ఉంది వీరి కథ అని అనుకుంటున్నారు సామాన్య ప్రజానీకం.