Begin typing your search above and press return to search.

అమ్మ విధేయుడికే తాత్కాలిక సీఎం ప‌ద‌వి!

By:  Tupaki Desk   |   7 Oct 2016 4:04 PM GMT
అమ్మ విధేయుడికే తాత్కాలిక సీఎం ప‌ద‌వి!
X
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్య కార‌ణాల నేప‌థ్యంలో తాత్కాలిక సీఎంపై క్లారిటీ వ‌చ్చింది. జ‌య‌లలిత ఆరోగ్య ప‌రిస్థితుల రీత్యా ఆమె మరిన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాలని అపోలో ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలనకు ఆటంకం కలుగకుండా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జయలలితకు చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వంను తాత్కాలిక సీఎంగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం. ఇద్ద‌రు మంత్రులతో స‌మావేశం అయిన‌ప్ప‌టికీ ప‌న్నీర్ సెల్వం వైపే పార్టీ వ‌ర్గాలు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో రెండు ద‌ఫాలుగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా చేసిన‌ అనుభ‌వం ఉన్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా శ‌నివారం త‌మిళ‌నాడుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రానున్నార‌ని స‌మాచారం.

తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌ భవన్‌ లో ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌ రావుతో మంత్రులు పన్నీర్ సెల్వం - పళనిస్వామితోపాటు సీఎస్ రామ్మోహన్‌రావు సమావేశమయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌ రావుకు సీఎస్ రామ్మోహన్‌ రావు వివరించారు. రాష్ట్రంలో పాలన తీరు విషయాలను సీఎస్‌ ను అడిగి గవర్నర్ తెలుసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జయలలితకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న విషయం విదితమే. లండన్ వైద్యనిపుణుడు రిచర్డ్ బెలే నేతృత్వంలో జయకు చికిత్స చేస్తున్నారు. ఊపిరితిత్తులు - మధుమేహం - ఆస్తమా - ఇన్‌ ఫెక్షన్లకు సంబంధించి చికిత్స కొనసాగుతోంది. సుదీర్ఘకాలం జయలలితను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/