Begin typing your search above and press return to search.

చిన్నమ్మ తుమ్మినా సీఎం రాజీనామానేనా?

By:  Tupaki Desk   |   31 Dec 2016 4:49 AM GMT
చిన్నమ్మ తుమ్మినా సీఎం రాజీనామానేనా?
X
విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో తెలిపే ఘటన ఇది. అమ్మకే కాదు చిన్నమ్మకు సైతం తాను వీర విధేయుడినన్న విషయాన్ని చాటి చెబుతూ.. వారిచ్చిన సీఎం పదవి భిక్ష పట్ల అంతులేని వినయాన్ని.. విధేయతను ప్రదర్శిస్తున్న పన్నీరు సెల్వం పదవి ఏ నిమిషాన ఎప్పుడు ఊడుతుందోనన్న భావన వ్యక్తమవుతోంది.

తమిళనాడులో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా.. పన్నీరు సెల్వం రాజీనామా చేయనున్నారన్న పుకారు ఇప్పుడు మామూలన్నట్లుగా మారింది. చిన్నమ్మ చేతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలంతా తమ.. తమ నియోజకవర్గాలకు వెళుతున్నారు. వారంతా జర్నీలో ఉన్న వేళ.. వారికో మెసేజ్ అందింది.

అదేమంటే.. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వేళకు అందరూ చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయానికి రావాలంటూ ఆదేశించారు. అప్పటివరకూ అంతా బాగున్న వేళ.. ఉన్నట్లుండిఈ మేసేజ్ ఏమిటంటూ.. తమకు తెలిసిన వారిని ఆరా తీయటం షురూ చేశారు. ఇది కాస్తా.. పన్నీరు సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారన్నట్లుగా సందేశం చక్కర్లు కొట్టింది.

పార్టీ పగ్గాలు అందుకోనున్న చిన్నమ్మ.. ఆ వెంటనే సీఎం పదవిని చేపట్టాలని అనుకుంటున్నారని.. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు అందరిని పార్టీ ప్రధాన కార్యాలయానికి రమ్మన్నారన్న భావన వ్యక్తమైంది. ఇలా.. చిన్నమ్మ తుమ్మినా.. దగ్గినా.. పన్నీరు సెల్వం పదవి ఊడిపోయినట్లేనన్న ప్రచారం సాగుతోంది. ఇన్ని జరుగుతున్నా.. విధేయతకు మారు పేరు అన్నట్లుగా.. చిన్నమ్మ ఆదేశాలు మినహా మిగిలిన వాటితో తనకేం సంబంధం లేనట్లుగా సాగుతున్న పన్నీరు సెల్వం లాంటి వారు సమకాలీన రాజకీయాల్లో చాలా తక్కువగా కనిపిస్తారేమో. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. పార్టీ ఎమ్మెల్యేల్ని శుక్రవారం సాయంత్రానికి పార్టీ కార్యాలయానికి రమ్మంటూ పంపిన సందేశం ఎందుకన్న విషయంలోకి వెళితే.. పార్టీ చీఫ్ గా ఎన్నికైన చిన్నమ్మ అమ్మ సమాధి వద్ద అంజలి ఘటిస్తారని.. ఆ సందర్భంగా అక్కడ అందరూ ఉండాలన్న ఉద్దేశంతో మెసేజ్ పెట్టటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/