Begin typing your search above and press return to search.

చీలిక దిశ‌గా అమ్మ‌పార్టీ ??

By:  Tupaki Desk   |   5 Feb 2017 5:35 AM GMT
చీలిక దిశ‌గా అమ్మ‌పార్టీ ??
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన పన్నీర్ సెల్వం ను తప్పించి తాను సీఎం కావాలని పార్టీ ఆపద్ధర్మ ప్రధాన కార్యదర్శి శశికళ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా - శాసనసభా పక్ష నేతగా శశికళను ఎన్నుకోవడానికి రంగం సిద్ధమైందని చెబుతున్నారు. అయితే చివరి నిముషంలో అనూహ్యంగా పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అనడంతో పార్టీలో చీలిక అనవార్యమనే పరిస్థితి ఏర్పడింది. కాగా రాజకీయ ప్రవేశం చేసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప మద్దతును పన్నీర్ సెల్వం కోరినట్లు చెబుతున్నారు.

ఈరోజు చెన్నైలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరుగనున్నట్టు ఏఐడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మీడియాకు తెలిపారు. శశికళ సీఎం పదవి చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా కోరవచ్చునని తెలుస్తోంది. వారంతా ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం పన్నీరు సెల్వంను తొలగించి సోమవారం శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించవచ్చునని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కొందరు సీనియర్ నాయకులు మాత్రం ఇవన్నీ ఊహాత్మక కథనాలంటూ కొట్టిపారేస్తున్నారు. జయలలిత మరణించినప్పటి నుంచే శశికళ పార్టీ పగ్గాలతోపాటు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై బహిరంగంగానే పార్టీ బాధ్యతలు, సీఎం పదవి ఒకరి చేతుల్లోనే ఉండాలని, శశికళ సీఎం పదవి చేపట్టాలని కోరారు. నలుగురు రాష్ట్రమంత్రులు సైతం శశికళ సీఎం కావాలని డిమాండ్ చేశారు.

శశికళ పార్టీతోపాటు, ప్రభుత్వంలోనూ తన అనుకూల వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తున్నారు. జయలలిత వివిధ కారణాలతో పక్కనబెట్టిన నాయకులందరికీ పార్టీలో పదవులు కట్టబెట్టారని పేర్కొంటున్నారు. శశికళ శుక్రవారం 23 మంది మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు సహా సీనియర్ నాయకులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రులు కేఏ సెంగొట్టయాన్, ఎస్ గోకుల ఇందిరా, బీవీ రమణ, మాజీ మేయర్ ఎస్ దురైస్వామి, మత్స్యశాఖ మంత్రి డీ జయకుమార్ సహా 13 మందిని పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీలుగా నియమించారు. అంబత్తూర్ ఎమ్మెల్యే వీ అలెగ్జాండర్‌ను ఎంజీఆర్ యూత్ వింగ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు జయలలిత చికిత్సకోసం దవాఖానలో చేరినప్పుడు ప్రభుత్వాన్ని నడిపించిన ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. ఆమె పదవీవిరమణకు మరో రెండు నెలల గడువు మాత్రమే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి పీఏలు కేఎన్ వెంకటరామన్, రామలింగం రాజీనామాలకు సైతం సీఎం పన్నీరుసెల్వం శుక్రవారం రాత్రి ఆమోదం తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/