Begin typing your search above and press return to search.

చినమ్మ ఆయువుపట్టు మీద కొట్టనున్న పన్నీర్

By:  Tupaki Desk   |   9 Feb 2017 7:10 AM GMT
చినమ్మ ఆయువుపట్టు మీద కొట్టనున్న పన్నీర్
X
తమిళనాడు రాజకీయాలు అంతకంతకూ ఉత్కంటను రేపుతున్నాయి. ఎత్తులు.. పైఎత్తులతో అసలుసిసలు పొలిటికల్ థ్రిల్లర్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నమ్మ వర్సెస్ పన్నీరు గా మారిన తాజా సమరం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తాజాగా డీజీపీ.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో భేటీ అయిన పన్నీర్.. చెన్నై నగర కమిషనర్ పై వేటు వేయాలని సూచించారు.

అక్కడితో ఆగని ఆయన.. చిన్నమ్మకు అయువు పట్టులాంటి పోయెస్ గార్డెన్ ను జయ స్మారకంగా తీర్చిదిద్దాలన్న నిర్ణయాన్ని ప్రతిపాదించారు. ఈ నిర్ణయాన్ని కానీ అమలుచేయాల్సి వస్తే.. తొలుత.. చిన్నమ్మ శశికళను పోయెస్ గార్డెన్ నుంచి బయటకు పంపాల్సి ఉంటుంది. వాస్తవానికి పోయెస్ గార్డెన్ అమ్మ సొంతమే అయినా.. ఆమె మరణించిన తర్వాత.. చిన్నమ్మ అందులో ఉంటున్నారు.

అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం చిన్నమ్మను దెబ్బ తీసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారనిచెప్పాలి. పోయెస్ గార్డెన్ లో ఉన్నంత వరకూ చిన్నమ్మ అమ్మకు అప్రకటిత వారసురాలిగానే వ్యవహరించే వీలుంది. ఎప్పుడైతే.. ఆమె పోయెస్ ను బయటకు వస్తారో.. అప్పటి నుంచి ఆమెపై ఉన్న అమ్మ ముద్ర ఎంతో కొంత తగ్గుతుందని చెప్పాలి. దీనికి తోడు పోయెస్ గార్డెన్ కు ఉన్న వాస్తు బలం కారణంగా.. ఆ ఇంట్లో ఉండే వారు అధికారం చెలాయిస్తారని.. పవర్ ఫుల్ గా ఉంటారన్న మాట ప్రచారంలో ఉంది.

పన్నీర్ తీసుకున్న తాజా నిర్ణయం చూస్తే.. చిన్నమ్మ అయుధాల్ని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేయటంతో పాటు.. అమ్మ తర్వాతి చిన్నమ్మ అన్న ముద్రను తొలిగిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పాలి. పోయెస్ గార్డెన్ ను జయ స్మారక చిహ్నంగా మార్చాలన్న ఆయన నిర్ణయాన్ని ఎప్పటికి అమలు చేస్తారు? అదే జరిగితే.. చిన్నమ్మ మద్దతుదారుల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి తగ్గట్లే పన్నీర్ నిర్ణయం వెలువడిన కాసేపటికే చిన్నమ్మ మద్దతుదారులుగా పేర్కొంటూ పెద్ద ఎత్తున సమూహం పోయెస్ గార్డెన్ వైపు రావటం.. పన్నీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/