Begin typing your search above and press return to search.

సెల్వం..ప‌ళ‌ని బృందం చేస్తున్న కామెడీ ఇది

By:  Tupaki Desk   |   4 May 2017 1:51 PM GMT
సెల్వం..ప‌ళ‌ని బృందం చేస్తున్న కామెడీ ఇది
X
త‌మిళ‌నాడులో అధికార పార్టీ అయిన అన్నాడీఎంకెలోని మాజీ ముఖ్య‌మంత్రి పన్నీరు సెల్వం వర్గం, ప్ర‌స్తుత సీఎం పళని స్వామి వర్గాల విలీనం జ‌రిగేలా లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. రెండు వర్గాలు ఏకమవుతాయని నెల రోజుల క్రితమే ప్రకటించినా ఆ దిశగా ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విలీన ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ఇరు వర్గాలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 5 నుంచి పన్నీరు సెల్వం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతుండటం రెండు వర్గాల విలీనంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

దివంగ‌త జ‌య‌ల‌లిత పార్టీ నేత‌లుగా అన్నాడీఎంకే పార్టీని రక్షించుకోవడానికి ఏకమవుతున్నామని పళనిస్వామి-పన్నీర్‌ స్వామి వర్గాలు గతంలో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇరు వర్గాలకు చెందిన సీనియర్‌ నాయకులు అనేక సార్లు సమావేశమయ్యారు. శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి అనే పన్నీర్‌ వర్గం డిమాండ్‌కు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం తలొగ్గింది కూడా. అయితే అక్కడ నుంచి విలీన ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విలీనం కోసం ఇరు వర్గాలు కమిటీలు ఏర్పాటు చేసినా.. అవి ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అలాగే పళనిస్వామి ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఎలాంటి ముప్పులేదు. పళినిస్వామికి ప్రస్తుతం 123 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా వున్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి గండం లేకపోవడంతో ధీమాగా వున్న పళనిస్వామి వర్గం విలీనంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

కాగా, పన్నీరు సెల్వం తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పన్నీరు సెల్వం వర్గం కూడా వీలీనంపై దృష్టి పెట్టడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నెల 5 నుంచి రాష్ట్ర పర్యటన చేయాలని పన్నీరు సెల్వం భావిస్తున్నారు. ఈ నెల 5న కాంచీపురంలో ప్రారంభమయ్యే ఈ పర్యటన ఈ నెల చివరి వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 32 జిల్లాలోని తన మద్దతుదారులతో పన్నీరు సెల్వం సమావేశం అవుతారు. త‌ద్వారా త‌న‌కు ఉన్న ప‌ట్టును చాటిచెప్తార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే విలీనం ప్రక్రియ ముగిసిపోలేదని కొంత మంది నాయకులు అంటున్నారు. ఈ నెల ఐదవ తేదీని విలీనంపై చర్చలకు గడువుగా పెట్టుకున్నామని, ఆ లోపు చర్చలు జరిగి విలీనంపై స్పష్టత వచ్చే అవకాశం వుందని మెట్టూరు ఎమ్మెల్యే ఎస్‌. సెమ్మలై తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/