Begin typing your search above and press return to search.

తాలిబన్లకు చుక్కలు చూపిస్తోన్న పంజ్‌షిర్ .. 300 మంది హతం

By:  Tupaki Desk   |   2 Sep 2021 5:35 AM GMT
తాలిబన్లకు చుక్కలు చూపిస్తోన్న పంజ్‌షిర్ .. 300 మంది హతం
X
ఆఫ్ఘన్ ను ఆక్రమించుకున్నామని చెప్పుకుంటున్న తాలిబన్లకు పంజ్‌ షిర్ మాత్రం నిద్రలేకుండా చేస్తోంది. పంజ్‌ షిర్ కోసం తాలిబన్లు ఓ వైపు చర్చలు జరుపుతామంటూనే, మరోవైపు దాడులకు తెగబడ్డారు. దీనితో పంజ్‌ షిర్ ప్రాంతంలోని ఉత్తరాది దళాలు తాలిబన్ల పై విరుచుకుపడ్డారు. వందలాది మంది తాలిబన్లను హతమార్చాయి.అలాగే కొందరిని బందీలుగా మార్చారు. అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు, పంజ్‌షిర్‌ ను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఆ ప్రాంతం నేతలను బుధవారం చర్చలకు పిలిచారు. పర్వాన్ ప్రాంతంలో పంజ్‌ షిర్ కు చెందిన నేతలు, గిరిజన తెగలతో జరిపిన ఈ చర్చలు విఫలమైనట్లు తాలిబన్ల ప్రతినిధి ముల్లా అమిర్ ఖాన్ ముత్తాకి తెలిపారు.

పంజ్‌ షిర్ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం పంజ్‌ షిర్‌ లోయ ప్రజలే వారిని ఒప్పించాలని తాలిబన్లు సూచిస్తున్నారు. కాగా, చర్చలు జరుపుతూనే పంజ్‌ షిర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. దీనికి ధీటుగా బదులిచ్చాయి పంజ్‌ షిర్ బలగాలు. ఉత్తరకూటమి దళాలు జరిపిన దాడుల్లో వందలాది తాలిబన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వీరి మధ్య జరిగిన యుద్ధంలో 350 మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టినట్లు ఉత్తర కూటమి దళాలు ప్రకటించాయి. మరో 130 మందికిపైగా తాలిబన్ ఫైటర్లను బంధీలుగా చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి.

దీనితో మొత్తం ఆప్ఘనిస్థాన్‌ ను ఆక్రమించుకున్నా ఈ ప్రాంతం మాత్రం తమ చేతిలోకి రాకపోవడంతో తాలిబన్లు నిరాశలో ఉన్నారు. అంతేగాక, పంజ్‌ షిర్ ఆక్రమణకు కుట్రలకు తెరతీశారు తాలిబన్లు. ఆ ప్రాంతానికి ఆహార పదార్థాలను కూడా నిలిపివేస్తున్నారు. తాలిబన్ల సాయం కోరుతూ కాశ్మీర్‌ పై కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులు. ఆప్ఘనిస్తాన్ లో ఒకప్పుడు తాలిబన్లతో స్నేహం చేసి దాదాపు రెండు దశాబ్దాల పాటు వారిని తీవ్రవాదులుగా ప్రపంచం దృష్టిలో నిలబెట్టిన ఉగ్రవాద సంస్ధ అల్ ఖైదా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు వెనుదిరిగిన నేపథ్యంలో ఆ దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న అల్ ఖైదా అంతకు ముందే తాలిబన్లకు శుభాకాంక్షలు తెలిపింది.

గతంలో ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికాలో అల్ ఖైదా 9/11 దాడులు చేసింది. అమెరికా విమానాలతోనే వారి దేశంలోని డబ్ల్యూటీసీ టవర్లపై విరుచుకుపడింది. అమెరికాతో పాటు ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యం అల్ ఖైదాపై విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో అల్ ఖైదా స్ధావరంగా ఉన్న ఆప్ఘనిస్తాన్ పైనా దాడులకు దిగింది. పర్యవసానంగా తాలిబన్లు అధికారం కోల్పోవడంతో అక్కడ పాశ్చాత్యదేశాల కన్నుసన్నల్లో ఉండే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత భారత్ వంటి దేశాలు కూడా ఆప్ఘనిస్తాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు అభినృద్ధి చేశాయి. అయితే , తిరిగి మళ్లీ ఆఫ్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో సమస్య మొదటికొచ్చింది.