Begin typing your search above and press return to search.

రవీంద్రబాబు.. మళ్లీ టీడీపీలోకా..ఇంత కామెడీనా!

By:  Tupaki Desk   |   13 March 2019 4:33 AM GMT
రవీంద్రబాబు.. మళ్లీ టీడీపీలోకా..ఇంత కామెడీనా!
X
మొన్ననే చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. తెలుగుదేశం పార్టీలో కుల రాజకీయం అని చెప్పి.. తను లోక్ సభలో అన్ని సార్లు ప్రసంగిస్తే తనను పట్టించుకోలేదని.. గల్లా జయదేవ్ ప్రసంగిస్తే మాత్రం ఆయనకు సన్మానాలు చేసి - చేతిలో కత్తి పెట్టారని.. తెలుగుదేశం పార్టీలో బాబు సామాజికవర్గానికి తప్ప మరెవరికీ గుర్తింపు దక్కే పరిస్థితి లేదని చెప్పి.. వీరావేశంతో తెలుగుదేశం పార్టీ కండువాను విసిరి కొట్టి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు అప్పుడే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు ఆశ్చర్యాన్ని కలిగించకమానవు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ సంగతేమో కానీ.. తిరిగి రావాలని.. అమలాపురం ఎంపీ టికెట్ ఖాయమని తెలుగుదేశం పార్టీ పండులకు బంపర్ ఆఫర్ ఇస్తోందట. చంద్రబాబును తిట్టి వెళ్లిపోయినా ఫర్వాలేదు - తిరిగి వస్తే చాలు అని తెలుగుదేశం పార్టీ ఊరిస్తోందట.

అమలాపురంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి అవసరం ఉంది. అందుకోసం రవీంద్రబాబునే తెలుగుదేశం బుజ్జగిస్తోందట. ఈ నేపథ్యంలో లోలోన ఏం జరిగిందో ఏమో కానీ.. రవీంద్రబాబు పునరాలోచనలో పడ్డారట. అనుచవర్గంతో సమావేశం అయ్యి.. ఏదో ఒక విషయాన్ని తేల్చుకుంటారట ఆయన.

బుధవారం రోజున అందుకు సంబంధించి అనుచరులతో రవీంద్రబాబు సమావేశం కానున్నారట. ఏదో ఒకటి తేల్చుకుంటారట. తేల్చుకోవడం సంగతలా ఉంటే.. అనుచరులు ఏం చెబుతారనే విషయం పక్కన పెడితే.. ఇంతకీ జనాలకు ఏం సమాధానం చెబుతున్నట్టు?

పక్షం రోజుల వ్యవధిలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లి, మొదటి పార్టీని తిట్టి.. ఇప్పుడు మళ్లీ రెండో పార్టీ నుంచి మొదటి పార్టీలోకి వచ్చి.. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే.. జనాలు ఏమనుకుంటారు? ఏదో ఒకసారి పార్టీ మారారు అంటే ఏదో అనుకుంటారు జనాలు.

అలాంటిది పక్షం రోజుల వ్యవధిలో అటూ ఇటూ గెంతితే..జనాలు ఏం అనుకుంటారనే భయం ఈ నేతలకు లేదా? మరీ ఇంత తెగింపా? మరీ ఇలా మారుతుంటే.. నేతలే కాదు - వీరిని ఎంటర్ టైన్ చేసే పార్టీలు కూడా జనాలకు చులకన అయ్యే అవకాశాలున్నాయి. పార్టీలు కూడా తమ అవసరాల కోసం ఇలా ఎన్ని వేషాలు వేసినా నేతలను ఎంటర్ టైన్ చేసే పరిస్థితే ఉంది!