Begin typing your search above and press return to search.

తాలిబన్లు చంపితే చంపనీ.. గుడిని వదలి రానంటున్నపూజారి

By:  Tupaki Desk   |   18 Aug 2021 3:36 AM GMT
తాలిబన్లు చంపితే చంపనీ.. గుడిని వదలి రానంటున్నపూజారి
X
పుట్టిన గడ్డ మీద ఉండే మమకారం అంతా ఇంతా కాదు. కాలం తెచ్చిన మార్పుతో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాలం పరీక్ష పెడుతుంది. ప్రాణహాని పొంచి ఉంటుంది. అంత మాత్రాన పుట్టినగడ్డను వదిలేస్తామా? పిరికితనంతో పారిపోవటమా? పోరాడదాం.. ఆ క్రమంలో ప్రాణాలు పోతాయా? పోనివ్వండి.. ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికోఎందుకు వెళ్లాలి? వంద ఏళ్లుగా వంశపార్యంపరంగా వస్తున్న సంప్రదాయాన్ని.. పూర్వీకులు అప్పజెప్పిన బాధ్యతల్ని విడిచి పెట్టి వెళ్లిపోవటమా? అంటూ అతడు వేస్తున్న ప్రశ్నలు కొత్త చర్చగా మారాయి.

అప్గాన్ రాజ్యాధికారం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన వేళ..ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్న వారెందరో. బతికి ఉంటే బలుశాకు తినొచ్చన్న చందంగా వ్యవహరించే దానికి భిన్నంగా ఒక పురోహితుడు ప్రదర్శిస్తున్న తెగువ.. పుట్టిన గడ్డపై తనకున్న మమకారాన్ని తేల్చి చెబుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో అఫ్గాన్ నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ఎంతలా ప్రయత్నిస్తున్నారో.. రెండు రోజులుగా టీవీల్లోనూ.. సోషల్ మీడియాలోనూ.. యూ ట్యూబ్ లలో తెగ చూసేస్తున్నాం.

ఇలాంటివేళ.. వీరందరికి భిన్నంగా ఒక పురోహితుడు మాత్రం తానున్న ప్రాంతాన్ని వదిలి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఆయన పేరు పండిత్ రాజేశ్ కమార్. ఆఫ్గాన్ లో ఆయనో పురోహితుడు. ఒక దేవాయలంలో పూజారిగా సేవలు అందిస్తూ ఉంటారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ లోని రతన్ నాథ్ మందిరంలో ఆయన పూజారిగా వ్యవహరిస్తుంటారు. వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు ఇక్కడే.. ఈ ఆలయానికే సేవలు అందిస్తున్నారని.. అలాంటిది తాను గుడిని వదిలి ఎలా వస్తానంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ.. తాలిబన్లు చంపేస్తే.. ఆనందంగా చనిపోతానని.. దైవసేవలో భాగంగా జరిగిందని భావిస్తానని చెబుతున్నారు. కాబూల్ ను విడిచి పెట్టి వెళ్లిపోతున్న వారిలో కొందరు పండిత్ రాజేశ్ ను తమతో పాటు వచ్చేయాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు ఈ గుడికి సేవ చేస్తున్నారని.. అందుకే తాను గుడిచి విడిచి పెట్టి రాలేనని తేల్చేశారు. దీంతో.. గుడికి వచ్చే హిందువులు పలువురుఆయన మాటతో నిరాశగా వెనుదిరిగారు. ఈయనకు సంబంధించి వివరాల్ని ఒకనెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఈయన ఉదంతం బయటకు వచ్చింది. అఫ్గాన్లోని చాలామందికి భిన్నమైన రీతిలో ఆయన తీరు ఉండటం.. దేశం పట్ల.. ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్ మెంట్ ను పలువురు అభినందిస్తున్నారు.