Begin typing your search above and press return to search.

లాక్​డౌన్​ ఎత్తేయగానే విచ్చలవిడిగా తిరిగారు.. ఫలితమే కరోనా సెకండ్​వేవ్​!

By:  Tupaki Desk   |   1 Nov 2020 12:30 AM GMT
లాక్​డౌన్​ ఎత్తేయగానే విచ్చలవిడిగా తిరిగారు.. ఫలితమే కరోనా సెకండ్​వేవ్​!
X
ప్రస్తుతం కరోనా కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా.. మళ్లీ సెకండ్​ వేవ్​ రూపంలో విజృంభిస్తుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యూరప్​, అమెరికా ప్రజలు సేకండ్​ వేవ్​ పేరు వింటేనే గజగజ వణుకుతున్నారు. ఎందుకంటే సెకండ్​వేవ్​లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది. అమెరికాలో ఇప్పటికే రెండోదశ ప్రారంభమైందని కొన్ని అంతర్జాతీయ మీడియాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. అక్కడ రోజుకు 90 వేల కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా విజృంభిస్తున్నది. ఫ్రాన్స్‌లో దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. జర్మనీలోనూ పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.

పోర్చుగల్, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లో ఏకంగా కర్ఫ్యూ కొనసాగతున్నది. మరోవైపు బ్రిటన్​లోనూ లాక్​డౌన్​ విధిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. యూరప్‌ దేశాల్లో సగటన రోజుకు 1,370 మంది చనిపోతుండగా, అమెరికాలో 808 మంది చొప్పున మరణిస్తున్నారు. యూరప్​ దేశాల్లో కరోనా లాక్​డౌన్​ను చాలా మంది తేలికగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు. లాక్​డౌన్​ ఎత్తేయగానే ప్రజలంతా బార్లు, క్లబ్బులు, పబ్​ల వైపు పరుగులు తీశారు. మాస్క్​ ధరించలేదు. భౌతికదూరం పాటించలేదు. దీంతో సెకండ్​ వేవ్​ మొదలైనట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనాను అరికట్టడంలోనూ ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించలేదు. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌ కార్యక్రమం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే యూరప్‌లో పకడ్బందీగా అమలు కాలేదు. దీంతో సెకండ్​ వేవ్​ వచ్చింది.