Begin typing your search above and press return to search.

కోవిడ్ టెస్టు... ఫటాఫట్ !

By:  Tupaki Desk   |   10 July 2020 1:47 PM GMT
కోవిడ్ టెస్టు... ఫటాఫట్ !
X
కరోనా తొలిసారి హైదరాబాదులో వెలుగు చూసినపుడు ఒక టెస్టు చేయాలంటే... శాంపిల్ ని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపి టెస్టులు చేయించాల్సిన పరిస్థితి. ఫలితానికి రెండ్రోజుల సమయం పట్టేది. కానీ పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందంటే... ఇపుడు కేవలం 15 నిమిషాల్లో కరోనా ఉందా లేదా అనే లెక్క తేల్చేస్తున్నారు. ఖర్చు కూడా బాగా తగ్గింది.

ఏపీ ప్రభుత్వం టెస్టుల వేగంగా మరింత పెంచేసింది. కోవిడ్‌- 19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా నిమిషాల్లో ఫలితం తెలిసిపోతోంది. వీటితో పరీక్ష ఎలా చేస్తారో తెలుసా? ఈ కిట్‌లో ఉండే స్వాబ్‌తో మొదట ముక్కులో నుంచి జిగురును పరీక్ష కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో వేస్తారు. దానిని మూడు సార్లు తిప్పి మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల అనంతరం ఫలితం వెల్లడవుతుంది. కిట్‌పై రంగు మారకపోతే కరోనా నెగెటివ్, రంగు మారితే కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ప్రకటిస్తారు.

ముందు ప్రభుత్వం వీటిని రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు పంపింది. ప్రధానంగా ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చేవారికి ముందుగా వీటి సాయంతో టెస్టులు చేస్తారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. అయితే... లక్షణాలు లేని వారికే ఈ టెస్టులు. ఒకవేళ రోగికి కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉంటే ఈ టెస్టు అనంతరం నెగిటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా... ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష మరోసారి చేస్తారు.

కరోనా తొలిరోజుల్లో ఎవరికీ కరోనా ఉందో అనేభయంతో ఇతర వ్యాధులతో వచ్చిన వారికి చికిత్స చేయాలంటే వణికిపోయి ఆస్పత్రులు మూసుకున్నారు. కానీ వేగవంతమైన కరోనా పరీక్షల వల్ల ఇపుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. అత్యవసరం వైద్యం కోసం వచ్చిన వారికి వెంటనే కోవిడ్ టెస్టు చేసి నిర్దారించుకుని ఇతర వైద్యం చేస్తున్నారు.