Begin typing your search above and press return to search.

ఓరినాయనో.. ఆంధ్రాను ఆగమాగం చేసేశారే?

By:  Tupaki Desk   |   20 July 2020 4:00 PM GMT
ఓరినాయనో.. ఆంధ్రాను ఆగమాగం చేసేశారే?
X
శనివారం ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులు రెండున్నర వేలు. రెండు వారాల క్రితం.. ఆ మాటకు వస్తే వారం క్రితం సైతం తెలంగాణ.. అందునా హైదరాబాద్ తో పోలిస్తే.. ఏపీలోని ఏ నగరంలోనూ.. పట్టణంలోనూ కేసులు నమోదు కాని పరిస్థితి. అంతవరకూ ఎందుకు? ఆంధ్రా మొత్తం కేసులు కలిపినా కూడా హైదరాబాద్ కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్న దానికి భిన్నంగా.. ఈ రోజున నమోదవుతున్న తీరు చూస్తే.. ఒళ్లు జలదరించక మానదు.

మొన్నటివరకూ కట్టడితో ఉన్న ఏపీలో ఉన్నట్లుండి ఇంత భారీ ఎత్తున కేసులు ఎలా నమోదవుతున్నాయి? ఉన్నట్లుండి ఇంత భారీగా కేసులకు కారణం ఏమిటి? అన్నది క్వశ్చన్ గా మారింది. శనివారం రెండున్నర వేల పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆదివారం ఏకంగా ఐదు వేల కేసులకు పైనే నమోదయ్యాయి. ఈ రోజు (సోమవారం) కొత్తగా నమోదైన కేసులు నాలుగువేలకు పైనే. దీంతో.. ఏపీలో మొత్తం కరోనా కేసులు 53వేల అంకెను దాటిపోయాయి.

ఇందులో ఇప్పటికే కోలుకున్న వారు 24వేలు ఉంటే.. యాక్టివ్ కేసులు 28,800 కేసులు ఉన్నాయి. మొత్తం పదమూడు జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వెయ్యికి పైగా కేసులు నమోదు అయితే.. తర్వాతి స్థానం గుంటూరు జిల్లా నిలిచింది. అక్కడ 596 మందికి పాజిటివ్ గా తేలింది. తర్వాత స్థానం కర్నూలు జిల్లాగా చెప్పాలి. ఈ రోజు 559 కేసులు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లా ట్రిపుల్ ఫిగర్ ను దాటేశాయి. వీటిల్లో ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం అతి తక్కుగా 56 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇంతకూ ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదు అవుతున్నట్లు? అన్నది క్వశ్చన్. మొన్నటి వరకూ కేసులు పెద్దగా లేని ఏపీలో.. ఉన్నట్లుండి ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొత్త నిజం బయటకు వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో భారీగా పెరిగిపోతున్న కేసులకు భయపడిన లక్షలాది మంది తెలంగాణలోని జిల్లాలకు.. ఏపీలోని తమ సొంతూళ్లకు తరలి వచ్చేశారు.

హైదరాబాద్ లో కరోనా ముప్పు నుంచి వచ్చే క్రమంలో చాలామంది అక్కడ నుంచి వైరస్ మరకల్ని తీసుకొచ్చి.. ఊళ్లల్లో అంటించేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే.. తెలంగాణ జిల్లాల్లోనూ.. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ కేసులు పెరిగిపోగా.. అందుకు భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో కేసులు నాలుగు డిజిట్ల నుంచి మూడు డిజట్లకు అందునా.. ఆరేడు వందలకే పరిమితం కావటం గమనార్హం. మొత్తానికి హైదరాబాద్ దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు ఆగమాగం అయిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు.