Begin typing your search above and press return to search.

కొత్తగా మొదలైన కార్యదర్శి పంచాయితి

By:  Tupaki Desk   |   29 Jan 2021 9:30 AM GMT
కొత్తగా మొదలైన కార్యదర్శి పంచాయితి
X
స్టేట్ ఎలక్షన్ కమీషన్లో ఏదో ఒక పంచాయితి లేకపోతే ఇటు ప్రభుత్వానికి అటు కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పొద్దు పోయేట్లు లేదు. ఇప్పటికే ఉన్న అనేక పంచాయితీలు చాలవన్నట్లుగా కొత్తగా కార్యదర్శి పంచాయితి మొదలైంది. ఎలక్షన్ కమీషన్ కు కార్యదర్శిని నియమించాలి కాబట్టి అనుభవమున్న ఐఏఎస్ ను డిప్యుటేషన్ పై పంపాలని నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ప్రభుత్వం ఒక అధికారిని పంపింది. అయితే ఆ అధికారిని చేర్చుకోవటానికి నిమ్మగడ్డ ఇష్టపడక తిప్పిపంపారు.

తనకు మూడు పేర్లను ప్రతిపాదిస్తే తానిష్టం వచ్చిన అధికారిని తానే ఎంపిక చేసుకుంటానని చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో నిమ్మగడ్డ స్పష్టం చేశారు. నిజానికి నిమ్మగడ్డ కోరినట్లే ప్రభుత్వం మూడు పేర్లను పంపాలి. కమీషనర్ లేఖ ప్రకారం ప్రభత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, కన్నబాబు, రాజాబాబుల పేర్లతో ఓ ప్రతిపాదన పంపింది. అయితే ప్రభుత్వం పంపిన ముగ్గురు ఉన్నతాధికారులు కూడా నిమ్మగడ్డకు నచ్చలేదు.

దాంతో ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పేసిన నిమ్మగడ్డ తనంతట తానుగా గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన ఎం రవిచంద్రను ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చీఫ్ సెక్రటరీకి చెప్పి రవిచంద్రను కార్యదర్శిగా పంపమని ఆదేశించారు. అయితే రవిచంద్రను ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యదర్శిగా నియమించింది. దాంతో నిమ్మగడ్డ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

నిజానికి తనిష్టం వచ్చిన అధికారిని కార్యదర్శిగా నియమించుకునే అధికారం నిమ్మగడ్డకు లేదు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ప్రభుత్వం పంపిన మూడు పేర్లలో నుండే ఒకరిని ఎంపిక చేసుకోవాలి. ఇంతకుముందు కార్యదర్శిగా పనిచేసిన వాణిమోహన్ ను కమీషనర్ ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి నిమ్మగడ్డ వ్యవహారం నచ్చని అధికారులు కమీషన్లో పనిచేయటానికి ఇష్టపడటం లేదు.

గతంలో కమీషన్ కార్యదర్శిగా వాణీమోహన్ను నియమించినపుడు నిమ్మగడ్డ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇపుడు మాత్రమే మూడు పేర్లను పంపాలనే కండీషన్ పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. సరే అడిగారు కదాని ప్రభుత్వం మూడుపేర్లను పంపితే వాళ్ళని కాదని తనిష్టం వచ్చిన అధికారిని ఎంపిక చేసుకున్నారు. దాంతో కార్యదర్శి పంచాయితి ఇప్పట్లో పరిష్కారమయ్యేట్లు లేదు.