Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డకు సమస్యలు తప్పేలా లేవే

By:  Tupaki Desk   |   8 Feb 2021 5:30 PM GMT
నిమ్మగడ్డకు సమస్యలు తప్పేలా లేవే
X
అధికారంలో ఉన్నపుడు కాదు దిగిపోయిన తర్వాతే చూడాలి అయ్యవారి అసలు విషయం అనే నానుడి ఉంది మనకు. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇందుకు సరిగ్గా సరిపోతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజ్యాంగబద్దమైన సంస్ధని, రాజ్యాంగం ప్రసాదించిన అధికారాల పేరుతో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు కమీషనర్. ఎంత రెచ్చిపోయినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మార్చి 31వరకే.

మార్చి 31వ తేదీ ఎందుకంటే అదే రోజు నిమ్మగడ్డ రిటైర్ అవుతున్నారు కాబట్టే. ఇపుడు చెబుతున్న రాజ్యాంగబద్దమైన పదవి, రాజ్యాంగబద్దమైన అధికారులు సార్ కు రిటైర్ అయిన తర్వాత ఉండవు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్ళుంటుంది. రాజ్యాంగం ముసుగులో నిమ్మగడ్డ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిపోతోంది. మరి ఇపుడు చేస్తున్న ఓవర్ యాక్షన్ కు రియాక్షన్ కూడా ఉంటుంది కదా.

ఇదే విషయాన్ని పంచాయితిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిట్ కూడా ఇచ్చేశారు. నిమ్మగడ్డ రిటైర్ అయినా వదిలేది లేదని స్పష్టంగా ప్రకటించేశారు. నిజానికి పెద్దిరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. కానీ ఆయన రూటే సపరేటు కాబట్టే ముందే సూచనలు ఇచ్చేశారు. ప్రివిలేజ్ కమిటికి చేసిన ఫిర్యాదు కారణంగా నిమ్మగడ్డపై ఇప్పటికే ఓ సమావేశం అయ్యింది. రెండో సమావేశం తర్వాత స్పీకర్ ఆదేశాలతో నిమ్మగడ్డపై యాక్షన్ తీసుకుంటే కోర్టులు కూడా అడ్డుకునే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ప్రివిలేజ్ కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పారు. నిమ్మగడ్డను రెడీగా ఉండమని హెచ్చరించారంటే అర్ధం ఏమిటి ?

కమీషనర్ పై తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటి రెడీ అవుతోంది. నిమ్మగడ్డను కమీషనర్ గా బర్తరఫ్ చేయాలని కాకాణి గవర్నర్ ను డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని ఈనెల 21వ వరకు హౌస్ అరెస్టు చేయాలని, మీడియాతో మాట్లాడనీయకుండా నియంత్రించాలంటు జారీచేసిన ఆదేశాలకు నిమ్మగడ్డ మూల్యం చెల్లించాల్సిందే అని కాకాణి తీవ్రంగా మండిపడ్డారు. అయితే నిమ్మగడ్డ ఆదేశాలపై మంత్రి కోర్టులో మంత్రి కేసు వేయటం దాన్ని విచారణ జరిపిన కోర్టు నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లదని కొట్టేయటం తెలిసిందే.

కమీషనర్ హోదాలో తనకు రాజ్యాంగబద్దమైన అధికారులున్నాయని నిమ్మగడ్డ అనుకుంటున్నది కరెక్టే. అయితే పెద్దిరెడ్డి కూడా రాజ్యాంగప్రకారమే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయాన్ని నిమ్మగడ్డ అంగీకరించలేకపోతున్నారు. తనకు అధికారాలను ఇచ్చిన రాజ్యాంగమే పెద్దిరెడ్డికి కూడా కొన్ని అధికారాలను ఇచ్చిందన్న విషయాన్ని ఒప్పుకోవటం లేదు. మంత్రి హౌస్ అరెస్టుకు ఆదేశాలు జారీచేయటం నిమ్మగడ్డ చేసిన ఓవర్ యాక్షన్ అని కోర్టు తీర్పుతో తేలిపోయింది. మరిలాంటి ఓవర్ యాక్షన్ చేస్తున్న నిమ్మగడ్డపై యాక్షన్ కు ప్రివిలేజ్ కమిటి రెడీ అయిపోతోంది. అంటే మార్చి 31 వరకు కూడా కమిటి ఆగేట్లు లేదు. చూద్దాం ఏమి జరుగుతుందో.