Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డపై చర్యలు తప్పవా ?

By:  Tupaki Desk   |   2 Feb 2021 2:44 AM GMT
నిమ్మగడ్డపై చర్యలు తప్పవా ?
X
ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వివాదం బాగా ముదిరిపోతోంది. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై మంగళవారం సభాహక్కుల సంఘం సమావేశమవుతోంది. ఇద్దరు మంత్రులపై నిమ్మగడ్డ నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయటాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దాంతో నిమ్మగడ్డపై మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభాహక్కులసంఘం దృష్టికి తీసుకెళుతు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఫిర్యాదు చేశారు.

మంత్రుల ఫిర్యాదుపై స్పీకర్ సభాహక్కుల సంఘానికి సిఫారసు చేశారు. స్పీకర్ నుండి వచ్చిన సిఫారసు ఆధారంగా మంగళవారం సమావేశం అవ్వాలని హక్కుల సంఘం ఛైర్మన్ డిసైడ్ చేశారు. బహుశా గవర్నర్ కు ఫిర్యాదు చేయటంపై నిమ్మగడ్డ నుండి వివరణ కోరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ చాలా ఓవర్ గా చేస్తున్నారని, లక్ష్మణ రేఖను దాటేసినట్లు అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు.

ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్న సుప్రింకోర్టు తీర్పును అవకాశంగా పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ ఉద్దేశ్యపూర్వకంగానే వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారాలు లేకపోయినా ఇద్దరు ఉన్నతాధికారులను అభిశింసిచాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించటం, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపుల్ సెక్రటరీని బాధ్యతల నుండి తప్పించాలని చెప్పటం, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసేయాలని ఆదేశించటం లాంటి అనేక చర్యలు ఓవర్ యాక్షన్ తప్ప మరోటి కాదని వైసీపీ నేతలంటున్నారు.

దీనికీతోడు కడప జిల్లా పర్యటనలో అసందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రస్తావన తేవటం, జగన్మోహన్ రెడ్డి మీదున్న సీబీఐ కేసుల విచారణను ప్రస్తావించటాన్ని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. వీటన్నింటికి అదనంగా మంత్రులపై నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా గవర్నర్ కు ఫిర్యాదు చేయటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే తాను కూడా అలాంటి చర్యలే తీసుకోవాల్సుంటుందని పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించటం గమనార్హం.

పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే నిమ్మగడ్డ దాన్ని తప్పు పడుతు మాట్లాడుతున్నారు. ఏకగ్రీవాలు కుదరదని ఎన్నికలు జరగాల్సిందే అంటున్నారు. పైగా నిమ్మగడ్డ మాట్లాడే ప్రతిమాట చంద్రబాబునాయుడుకు మద్దతుగానే ఉంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి అనేక అంశాల కారణంగా చివరకు స్పీకర్ ఆదేశంతో సభాహక్కుల ఉల్లంఘన ఆరోపణలపై నిమ్మగడ్డ విషయంపైనే ఈరోజు సమావేశం జరుగుతోంది. బహుశా నిమ్మగడ్డకు నోటీసు ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. ఆ నోటీసులో ఏముంటుంది, దానికి నిమ్మగడ్డ రియాక్షన్ ఎలాగుంటుంది అన్న విషయం ఆసక్తిగా మారింది.