Begin typing your search above and press return to search.

ఏకగ్రీవాలకు పైఎత్తు వేస్తున్న టీడీపీ..

By:  Tupaki Desk   |   31 Jan 2021 12:30 PM GMT
ఏకగ్రీవాలకు పైఎత్తు వేస్తున్న టీడీపీ..
X
ఏపీలో మొదలైన పంచాయితీ పోరు రాజకీయ వేడిని రగిల్చింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నిక కమిషన్ అన్నది సరిపోనట్లు.. ఏకగ్రీవాలపై రచ్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో వీలైనంతవరకు ఏకగ్రీవాలతో పూర్తి చేయటం ద్వారా అనవసరమైన ఉద్రిక్తతలకు చెక్ పెట్టినట్లుగా కొందరు భావిస్తుంటే.. ఏది ఏమైనా ఎన్నికలు జరగాల్సిందే అన్న రీతిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏకగ్రీవాలు సహజసిద్ధంగా సాగాలే తప్పించి బలవంతపు ఏకగ్రీవాలు సరికాదు.

రాజకీయ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ఒకరిపై మరొకరు అధిక్యతను ప్రదర్శించేందుకు సాగుతున్న అధికార.. విపక్ష నేతల తీరు రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఏకగ్రీవాలకు ఏపీ అధికార వర్గ నేతల వాదన ఒకలా ఉంటే.. విపక్ష నేతల వాదన మరోలా ఉంది. ఏకగ్రీవాల పేరుతో తాము ఏదో తప్పులు చేస్తున్నట్లుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని.. అదే మాత్రం సరికాదంటున్నారు. పంచాయితీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం ఉండదు. అయినప్పటికీ పార్టీల చుట్టూనే ఎన్నికలు జరుగుతుంటాయి.

ఎన్నికల్లో అధికారపార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పదవుల్ని సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. దీంతో.. చాలా గ్రామాల్లో పదవుల్ని ఆశించే వారు ఎక్కువగా ఉండటం.. సానుభూతిపరుల్లో చీలిక వస్తోందన్నది అధికారపార్టీ ఆందోళన చెందుతోంది. ఈ చీలికల్ని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గం ఏకగ్రీవాలే. ఎన్నికల్లో పోటీ అన్నదే లేకుంటే చీలికలు.. వర్గాలు ఉండవని.. అందుకే ఏకగ్రీవాల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అధికార పార్టీ సానుభూతిపరుల్లో చీలికల్ని తమకు ప్రయోజనకరంగా మార్చుకోవాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. అందుకే.. చీలికల్ని ప్రోత్సహిస్తూ.. ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తునట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు అంగీకరించొద్దని.. అన్ని చోట్ల పోటీలు జరిగేట్లు చూడాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రతిరోజు ఆన్ లైన్ లో సమావేశాల్ని నిర్వహిస్తున్నారు.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని చీలిక వర్గానికి దన్నుగా నిలుస్తూ.. వారిని దెబ్బ తీయాలన్న వ్యూహాన్ని తెలుగు తమ్ముళ్లు అమలు చేస్తున్నారు. దీంతో.. ఏకగ్రీవాలతో ఎన్నికల్ని ముగించాలని అధికార పార్టీ నేతలు భావిస్తుంటే.. ఏదోలా చేసి చీలికల్ని ప్రోత్సహించి.. ఎన్నికలు జరిగేలా చేయాలన్న విపక్ష టీడీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.