Begin typing your search above and press return to search.

పవన్ కు ‘పంచాయితీ’ టెన్షన్?

By:  Tupaki Desk   |   27 Jan 2021 9:30 AM GMT
పవన్ కు ‘పంచాయితీ’ టెన్షన్?
X
ఏపీలో పంచాయితీ ఎన్నికల నగరా మోగింది. నో చెప్పిన అధికార వైసీపీ కూడా ఎన్నికలకు సై అన్నది. ప్రతిపక్ష టీడీపీ సైతం ఆ పనిలో పడింది. సహజంగానే అధికారంలో ఉండడంతో వైసీపీకి కాస్త ఆధిక్యత పంచాయితీ ఎన్నికల్లో ఉంటుంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లే కావడంతో ప్రజలు సహజంగానే ఆ పార్టీకే పట్టం కడుతారు. మార్పును ఇంత త్వరగా కోరుకోరు. ఇంకో మూడేళ్లు వైసీపీ అధికారంలో ఉండడంతో అభివృద్ధి దృష్ట్యా అధికార పార్టీకే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు గెలిపిస్తారు.

అయితే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎప్పుడో కసరత్తు మొదలుపెట్టింది.

ఇక బీజేపీ-జనసేన పార్టీల పరిస్థితి ఏంటనేది తేలడం లేదు. ఈ రెండు పార్టీలకు గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణమే లేదు. బీజేపీ కనీసం 2019 ఎన్నికల తర్వాత అంతో ఇంతో కార్యవర్గాలను ఏర్పాటు చేసి బలపడింది. ఇక జనసేన మాత్రం ఏలాంటి కమిటీలు, గ్రామస్థాయి కార్యవర్గం బలం లేకుండా ఉంది. దీంతో జనసేన పార్టీలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి అయోమయం నెలకొంది.

జనసేనాని పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ ప్రారంభించినా పొత్తులతోనే సంసారం వెళ్లదీస్తూ పార్టీ బలోపేతం కోసం.. క్షేత్రస్థాయి నుంచి విస్తరించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో ఉంది. కనీసం 2019లో ఓటమి తర్వాత కూడా పవన్ మారలేదు. అదే సమయంలో సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక బీజేపీ ఆ దిశగా అంతో ఇంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది.

పంచాయితీ ఎన్నికల విషయంలో ఇప్పటికీ జనసేన కేడర్ గందరగోళంలో ఉంది. పైగా బీజేపీతో పొత్తుపై క్లారిటీ లేదు. ఈసారి సీట్ల పంపకం పెద్ద టాస్క్ గా జనసేనకు మారింది. రెండేళ్లలో పెద్దగా పార్టీని పవన్ విస్తరించింది లేదు. ఇన్ని సమస్యల మధ్య జనసేనాని పవన్ ఈ ‘పంచాయితీ’ని ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తిగా మారింది.