Begin typing your search above and press return to search.

అసలు పంచాయితి ఎన్నికలను ఎందుకు ఎత్తుకున్నారు ?

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:33 AM GMT
అసలు పంచాయితి ఎన్నికలను ఎందుకు ఎత్తుకున్నారు ?
X
ఇపుడిదే ప్రశ్న అందరినీ పట్టి పీడిస్తోంది. పోయిన సంవత్సరం మార్చిలో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అర్ధాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. దాదాపు పది నెలల తర్వాత మళ్ళీ స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ మొదలుపెట్టారు. అప్పుడు ఎన్నికలను వాయిదా వేయటం ఏకపక్షంగానే ఇపుడు ప్రక్రియ మొదలుపెట్టిందీ ఏకపక్షంగానే.

సరే పంచాయితీ ఎన్నికల ప్రక్రియను ఎందుకు మొదలుపెట్టారు ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే అప్పట్లో అర్ధాంతరంగా ఆపేసిన ఎంపిటీసీ, జడ్పీటీపీ ఎన్నికల ప్రక్రియను కదా మొదలుపెట్టాల్సింది. అప్పట్లో ఏకగ్రీవం అయిన ఎంపిటీసీ, జడ్పీటీసీ స్ధానాలను వదిలేస్తే 7,331 ఎంపిటీసీ, 526 జడ్పీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగాల్సుంది. ఎంపిటీసీలకు 19 వేలమంది, 2092 మంది జడ్పీటీసీల బరిలో ఉన్నారు.

ఎవరైనా కూడా అప్పటి ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో ముందుగా వాటిని పూర్తి చేయాలని అనుకుంటారు. కానీ నిమ్మగడ్డ మాత్రం విచిత్రంగా వాటిని వదిలిపెట్టేసి కొత్తగా పంచాయితీ ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ ఎందుకు మొదలుపెట్టారో తెలీదు. పైగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వంతో మాట్లాడకుండా పునఃప్రారంభించద్దని సుప్రింకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా సుప్రిం ఆదేశాలను కూడా నిమ్మగడ్డ పట్టించుకోలేదు.

మొత్తానికి నిమ్మగడ్డ చేష్టలన్నీ తెలుగుదేశంపార్టీ ప్రయోజనాలను రక్షించటానికే ఉన్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడకుండా ఎన్నికల ప్రక్రియను నిర్ణయించద్దని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పినా నిమ్మగడ్డ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు మండిపోతున్నారు. అయితే ఎవరేమనుకున్నా నిమ్మగడ్డ మాత్రం తాను అనుకున్నట్లుగానే నోటిఫికేషన్ జారీ చేసేసి ముందుకెళిపోతున్నారు.