Begin typing your search above and press return to search.

బాబు ముందు ‘పంచాయితీ’ గోడు వెళ్లబోసుకున్న తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   23 Feb 2021 6:30 AM GMT
బాబు ముందు ‘పంచాయితీ’ గోడు వెళ్లబోసుకున్న తమ్ముళ్లు
X
పంచాయితీ నాలుగో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. నేతలతోనూ.. వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో కలిసి భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా వారు పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎదుర్కొన్న దారుణాల చిట్టాను వినిపించారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన బాబు.. వారి ఆవేదనను నేరుగా వినిపించారు. ఈ సందర్భంగా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి.. చేదు అనుభవాలు ఎదుర్కొన్న పలువురు తెలుగు తమ్ముళ్లు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పంచాయితీ బరిలో దిగిన తాము.. ఎన్నికల్లో గెలుపొందినా అధికారులు మాత్రం వైరి వర్గానికి చెందిన వారు గెలిచినట్లుగా తేల్చారని చెప్పారు. ఒక్కో చోట ఒక్కోలా జరిగిన ఈ ఉదంతాల్లో.. తమ ప్రత్యర్థులు ఎన్నికల్లో గెలిచినట్లుగా అధికారులు వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఒడ్డూరు నుంచి వచ్చిన బాబు మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో తనకు 20 శాతం ఓట్లు వచ్చాయని.. అయితే.. ఒక ఓట్ల కట్ట పోయిందని.. ఆ ఓట్లు అన్ని వైసీపీవేనని చెప్పి.. ఆ పార్టీ మద్దతుదారు గెలిచినట్లుగా ప్రకటించారన్నారు.

తీర్థం గ్రామం నుంచి వచ్చిన మోహనమ్మ మాట్లాడుతూ.. రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ వేయాలని చెప్పగా.. రెండు గంటల పాటు ఫలితాన్ని వెల్లడించకుండా చెల్లని ఓట్లలో నుంచి 3 ఓట్లు తీసి.. వైసీపీ కలిపి గెలిచినట్లు ప్రకటించారన్నారు. చిత్తూరు జిల్లా అంగశెట్టిపల్లిలో సర్పంచ్ గా పోటీ చేసిన జంగాల వెంకటరమణ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో తొలుత తాను గెలిచినట్లు వెల్లడించారని.. స్థానిక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చినంతనే మూడు గంటల పాటు ఎన్నికల ఫలితాల్ని నిలిపి.. అనంతరం తనకు 120 ఓట్ల మెజార్టీ వచ్చినా తరిమేసి వైసీపీ మద్దతుదారు గెలిచినట్లుగా ప్రకటించారన్నారు.

గుంటూరు జిల్లా ఉంగుటూరు నుంచి వచ్చిన సర్పంచ్ అభ్యర్థి అనురాధ మాట్లాడుతూ టీడీపీ మద్దతుదారుగా తాను గెలిచిన తర్వాత రెండుసార్లు తన ఇంటిపై దాడికి వచ్చారని.. గ్రామంలో ఎలా తిరుగుతావో చూస్తామని బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఇలా పలువురు తమ్ముళ్లు తమ బాధల్ని వినిపించటం గమనార్హం.