Begin typing your search above and press return to search.

వైసీపీకి పంచకర్ల మార్క్ పంచ్

By:  Tupaki Desk   |   13 July 2023 4:29 PM GMT
వైసీపీకి పంచకర్ల మార్క్ పంచ్
X
విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబుకి కోపం వచ్చింది. ఆయన కోరుకున్న సీటు ఇవ్వలేదన్న బాధతో రెండు రోజులు ఆగి ఆలోచించి మరీ పార్టీకి రాజీనామా చేశారు. పంచకర్ల రమేష్ బాబు కోరుకుంటున్న పెందుర్తి సీటుని మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే కేటాయిస్తున్నట్లుగా వైసీపీ విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడంతో రమేష్ బాబు అలిగారు.

ఆయన 2009లో పెందుర్తి నుంచి ప్రజారాజ్యం తరఫున మొదటిసారి గెలిచారు. 2014లో ఆయన టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు 2019లో ఆయన ఎలమంచిలి నునిచ్ పోటీ చేసి ఓడిపోయారు. 2020లో ఆయన వైసీపీలోకి వచ్చారు. అయితే నాటి నుంచి ఆయనకు సరైన పదవి ఏదీ వైసీపీలో దక్కలేదు.

కానీ గత ఏడాది జగన్ ఆయనకు విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన జిల్లాకు వైసీపీ ఇంచార్జిగా నియమించారు. అయితే ఏడాది కాలంగా ఆ పదవిలో ఉన్న పంచకర్ల హయాంలోనే ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది. అది పంచకర్లకు ఇబ్బందిగానే పరిణమించింది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే పంచకర్ల విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉంటున్నారు. ఆయన ఆ సీటు నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అది కాకపోతే పెందుర్తిని అని కూడా రెండవ ఆప్షన్ గా పెట్టుకున్నారు. విశాఖ ఉత్తరం లో కేకే రాజు అనే ఒక నేత ఉన్నారు. ఆయన 2019లో పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ ఆయనకే జగన్ అవకాశం ఇచ్చారు.

ఇంకో వైపు చూస్తే పెందుర్తిలో తనకు అవకాశం ఉంటుందని పంచకర్ల భావించారు. దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డి ఆ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే అని ప్రకటించేశారు. దాంతో ఇక వైసీపీలో తనకు అవకాశం లేదని పంచకర్ల రాజీనామా చేశారని అంటున్నారు.

ఒక పార్టీ ప్రెసిడెంట్ గా స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశానని అయితే ఆ విషయంలో ఏమీ చేయలేకపోయాను అని పంచకర్ల అన్నారు. తాను జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి స్థానిక సమస్యల మీద పరిష్కరించలేకపోయాయని అన్నారు. పదవులు అలాంటపుడు ఎందుకు అని భావించే రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు. తనకు వైవీ సుబ్బారెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.

తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో నిర్ణయించుకుంటాను అని చెప్పారు. మొత్తానికి పంచకర్ల రాజీనామా విశాఖ జిల్లాలో వైసీపీకి ఎంతవరకూ నష్టం అన్న చర్చ సాగుతోంది. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన పంచకర్ల వైసీపీని వీడిపోవడంతో సిటీలో ఏమైనా ఇబ్బందా అన్న కోణంలో చర్చ సాగుతోంది.