Begin typing your search above and press return to search.

పనామా పేపర్స్ అమ్మ మొగుడీ పాండోరా పేపర్స్

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:30 AM GMT
పనామా పేపర్స్ అమ్మ మొగుడీ పాండోరా పేపర్స్
X
దాదాపు ఐదేళ్ల క్రితం పనామా పేపర్ల పేరుతో బయటకు వచ్చిన నగ్నసత్యాలకు ప్రపంచం వ్యాప్తంగా అవినీతిపరులు.. అక్రమార్కులు హాహాకారాలు చేయటమేకాదు.. పలువురి పీఠాలు కదిలిపోయాయి. దానికి మించిన రీతిలో తాజాగా పాండోరా పేపర్ల పేరుతో బయటకు వచ్చిన సమాచారం ప్రపంచం వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తల గుట్టు రట్టు చేసేలా ఈ పత్రాలు ఉండటం విశేషం.

పాండోరా పేపర్స్ పేరుతో ఆదివారం రాత్రి పేలిన ఈ సంచలన బాంబు దెబ్బకు ఎంతో మంద్రి ప్రముఖుల చీకటి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఈ పత్రాల్లో 91 దేశాలకు చెందిన వందలాది మంది ప్రస్తుత.. మాజీ ప్రపంచ నేతలు.. రాజకీయ నేతలు.. వ్యాపారవేత్తలు.. దౌత్యవేత్తలతో పాటు బిలియనీర్లు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం గమనార్హం.

అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు టీం (ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్) పొట్టిగా చెప్పాలంటే ఐసీఐజేగా చెప్పాలి. ఈ సంస్థ పరిధి కింద ప్రపంచ వ్యాప్తంగా పని చేసే పాత్రికేయులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేశారు. 117 దేశాల్లోని 150కు పైగా వార్తా సంస్థల్లో పని చేసే 600 మంది పాత్రికేయులు ఈ క్రతువులో పాలు పంచుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద పరిశోధత్మక విశ్లేషణగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

తాజాగా వెల్లడైన పత్రాల ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1.20కోట్ల రూపాయిల మేర ఆర్థిక లావాదేవీల పత్రాల్ని పరిశీలించి.. గుట్టుమట్లను రట్టు చేసింది. మొత్తంగా విశ్లేషించిన సమాచారం సైజు లెక్క వింటే.. రానున్న రోజుల్లో వెలుగు చూసే సంచలనాలు ఏ రీతిలో ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 2.94 టెరాబైట్ల మేర వివరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

భారత్.. అమెరికా.. రష్యాతో పాటు మొత్తం 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ లిస్టులో ఉన్నారు. వీరిలో అనిల్ అంబానీ పేరు వినిపిస్తోంది. బ్రిటన్ లోని ఒక కోర్టులో దివాలా ప్రకటించిన భారత పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి చెందిన 18 అసెట్ హోల్డింగ్ ఆఫ్ షోర్ కంపెనీలు ఉన్నాయి. బ్యాంకులకు టోపీ పెట్టి పరారైన నీరవ్ మోడీ భారత్ నుంచి పారిపోవటానికి ముందు తన సోదరితో ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన వైనం బయటకు వచ్చింది.

ఇప్పటివరకు విశ్లేషించిన దాని ప్రకారం 336 మంది ఉన్నతస్థాయి రాజకీయవేత్తలు.. అధికారులకు విదేశాల్లోని 956 కంపెనీల పేరుతో పెట్టుబడులు ఉన్నట్లగా తేల్చారు. వేరే పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల సాయంతో వీరింత ఆస్తుల్ని రహస్యంగా కొనుగోలు చేసినట్లుగా తేల్చారు. పనామా.. దుబాయ్.. మొనాకో.. స్విట్జర్లాండ్..కేమన్ ఐలాండ్స్ తదతర దేశాల్లో రహస్యంగా ఆర్థిక లావాదేవీల్ని సాగించినట్లుగా తేల్చారు.