Begin typing your search above and press return to search.

రూ.10 ల‌క్ష‌లు దాటితే పాన్ కావాల్సిందే!

By:  Tupaki Desk   |   24 Oct 2017 11:31 AM GMT
రూ.10 ల‌క్ష‌లు దాటితే పాన్ కావాల్సిందే!
X
పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం న‌ల్ల ధ‌నం వెలికితీత‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ దిశ‌గా బ్యాంకు ఖాతాల‌కు ఆధార్ కార్డుల‌ను అనుసంధానం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధికంగా భూముల రిజిస్ట్రేష‌న్ల ద్వారా ఎక్కువ న‌గ‌దు లావాదేవీలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై భూములు - స్థలాలు - ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా పాన్‌కార్డును జ‌త‌చేయాల‌ని తప్పనిసరి నిబంధ‌న చేశారు. రూ.10లక్షలు దాటే ప్రతి భూ లావాదేవీకి పాన్‌ కార్డు ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. పాన్ కార్డు లేని ప‌క్షంలో ఆ భూముల రిజిస్ట్రేషన్లను తిరస్కరించాల్సిందిగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఇన్‌ స్పెక్టర్‌ జనరల్.... అన్ని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఉత్తర్వులను జారీ చేశారు.న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీసే క్ర‌మంలో అమ్మకందారు - కొనుగోలుదారుల‌ ఆధార్‌ కార్డ్‌ నంబర్లు స‌మ‌ర్పించ‌ని డాక్యుమెంట్లను తిరస్కరిస్తున్నారు. అదే త‌ర‌హాలో పాన్ కార్డును కూడా రిజిస్ట్రేషన్లకు తప్పనిసరి చేశారు. గ‌తంలోనే ఈ నిబంధ‌న ఉన్నా - ఇపుడు దానిని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల్సిందేనంటూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

పెద్దనోట్ల రద్దు అనంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం న‌గ‌దు లావాదేవీలు - భూ రిజిస్ట్రేష‌న్ల‌పై క‌ఠిన నిబంధ‌న‌లు తెచ్చింది. రూ.2 లక్షలకు మించి జరిగే లావాదేవీలపై సమాచారం అందించాల‌ని ఆదాయపన్నుశాఖ గతంలోనే ....అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. గ‌తంలో రూ.30లక్షలకు మించిన రిజిస్ట్రేషన్ల లావాదేవీల‌ సమాచారం మాత్రమే ఆదాయ పన్ను శాఖకు వెళ్లేది. అయితే, 2016 న‌వంబ‌రు 8 న జ‌రిగిన పెద్ద నోట్ల రద్దు త‌ర్వాత‌ రూ.10లక్షలకు మించిన రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని అందజేయాలని రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది. చాలామంది ప్ర‌జ‌ల‌కు పాన్ కార్డు అవ‌స‌ర‌ముండ‌దు. అటువంటి వ్య‌క్తుల‌కు కేవ‌లం రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే పాన్ కార్డు అవ‌స‌రం ఉంది. దీంతో, అమ్మకందారు, కొనుగోలుదారుల పాన్‌ కార్డుల నిబంధ‌న‌పై అధికారులు పెద్దగా ఫోక‌స్ చేయ‌లేదు. తాజాగా, పాన్‌ కార్డు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. అయితే, రూ.10 లక్షలలోపు రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డు అవసరం లేదు. 10 ల‌క్ష‌లు దాటిన రిజిస్ట్రేష‌న్ల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి చేశారు. దాంతోపాటు, ఎవరి పేరిట ఎంత స్థిరాస్తులున్నాయన్న వివరాలు కూడా ఆదాయపన్ను శాఖకు అందే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. న‌గ‌దు లావాదేవీల త‌ర్వాత అత్య‌ధిక న‌ల్ల‌ధ‌నం భూములు - స్థ‌లాల రూపంలో ఉండ‌డంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది.