Begin typing your search above and press return to search.

‘పల్లె’ ప్రెస్ మీట్.. హాట్ హాట్

By:  Tupaki Desk   |   9 July 2016 11:31 AM GMT
‘పల్లె’ ప్రెస్ మీట్.. హాట్ హాట్
X
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు వెల్లడించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయం మీడియాకు కానీ, బహిరంగ సభల్లో ప్రజలకు కానీ చెప్పే నేతలైనా - అధికారులైనా తాము మొదట విషయం పూర్తిగా తెలుసుకుని - అర్థం చేసుకుని మాట్లాడాలి. లేదంటే కొంపలు మునిగిపోతాయి. తప్పుడు వివరాలు ప్రజలకు చేరితో గందరగోళం మొదలవుతోంది. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. ప్రజాగ్రహం పెల్లుబికినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.. అందులోనూ ప్రజలకు సంబంధించిన విషయమైతే మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో అంకెలు - లెక్కలు ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ మైకు ముందుకు రావాలి. కానీ... ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాత్రం అదేమీ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేసి గందరగోళం సృష్టించారు. తప్పుడు వివరాలు చెప్పి ప్రభుత్వాన్ని దోషిగా నిలిపారు.. అది గుర్తించిన ప్రభుత్వం వెంటనే మళ్లీ దానిపై స్పష్టత ఇచ్చి పొరపాటును సరిదిద్దుకుంది. ఇంత చేసిన పల్లెకు చంద్రబాబుతో ఫుల్లుగా చీవాట్లు పడ్డాయి. సాక్షాత్తు సమాచార శాఖ మంత్రి ఇచ్చిన సమాచారమే తప్పయితే చీవాట్లు వేయడంలో తప్పేమీ లేదు మరి.

అసలు విషయం ఏంటంటే మచిలీ పట్నం ఓడరేవు కోసం భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిపై కేబినెట్ భేటీలో నిన్న చర్చ జరిగింది. ఆ తరువాత పల్లె రఘునాథరెడ్డి దానిపై ప్రకటన చేశారు. అక్కడే అసలు తేడా జరిగింది. మైకందుకున్న పల్లె.. ప్రభుత్వం మచిలీ పట్నం ఓడరేవు కోసం 1.05 లక్షల ఎకరాల భూమిని సేకరించబోతోందని ప్రకటించారు. దాంతో రాష్ట్రమంతా దుమారం మొదలైపోయింది. ప్రతిపక్ష నేతలే కాదు ప్రజలు కూడా విమర్శలు మొదలుపెట్టారు. అసలు రాజధాని కోసం తీసుకున్న 33 వేల ఎకరాలే చాలా ఎక్కువనుకుంటే ఒక ఓడరేవు కోసం 1.05 లక్షల ఎకరాలా అన్న ప్రశ్న మొదలైంది. ఎంత పెద్ద ఓడరేవు నిర్మాణానికి అయినా సరే 3 వేల ఎకరాలకు మించి అవసరం లేదన్నది నిపుణుల మాట. అలాంటి గతంలో ఈ ఓడరేవుకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో 9నుంచి 10 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పుడే వ్యతిరేకత వచ్చింది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 6-7 వేల ఎకరాలు సేకరించాలని భావించినా అదీ జరగలేదు.

అలాంటిది ఇప్పుడు ఏకంగా లక్ష ఎకరాలనేసరికి అంతా ఆశ్చర్యపోయారు. విపక్షాల నుంచి విమర్శలు మొదలవడంతో ఏమైందో ప్రభుత్వం పరిశీలించింది. అసలు విషయం అప్పుడు బయటపడింది. సీఆర్‌ డీఏ తరహాలో మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ ఒకటి ఏర్పాటు చేశారని.. దాని పరిధి 425 చదరపు కిలోమీటర్లు ఉంటుందని.. మొత్తం 1.05 లక్షల ఎకరాలు ఉంటాయని కేబినెట్ భేటీలో చంద్రబాబు చెప్పారు. మచిలీ పట్నం రేవు కోసం సేకరించాలనుకున్నది 22 వేల ఎకరాలట. కానీ.. మంత్రి ఆ లక్ష ఎకరాలు మచిలీపట్నం రేవు కోసం అనుకున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇలా లక్ష ఎకరాల మాట ప్రెస్ మీట్లో చెప్పేసరికి ఆ ఏరియా రైతుల్లో టెన్షన్ మొదలైపోయింది. విపక్ష నేతలూ తమ నోళ్లకు పనిచెప్పారు. దాంతో ప్రభుత్వం తేరుకుని మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి అసలు అంకె చెప్పారు. కానీ.. విషయం సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు మంత్రి పల్లె రఘునాధరెడ్డికి గట్టిగా క్లాసు పీకారట. దీంతో అధికారులు ఇచ్చిందే తాను చదివాను కానీ తన తప్పేమీ లేదని మంత్రిగారు వాపోయారట. అదీ సమాచార శాఖ మంత్రిగారు ఇచ్చిన సమాచారం తీరు.