చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన విధంగా చెబితే.. విషయం ఏదైనా అందంగా ఉంటుంది. అంతేకానీ.. అంతా అయిపోయిన తర్వాత ఎంత చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
విభజన సమయంలో.. హైదరాబాద్‌లో తమకూ వాటా ఉందని.. ఏకపక్షంగా హైదరాబాద్‌ను తెలంగాణకు ఎలా కట్టబెడతారంటూ నిలదీయాల్సిన నేతలు.. అప్పట్లో మౌనంగా ఉండటం.. దీనికి తోడు తెలంగాణవాదులు.. హైదరాబాద్ తమ గుండె చప్పుడుగా అభివర్ణించిన విషయాన్ని మర్చిపోలేం. హైదరాబాద్ లేని తెలంగాణ తలకాయ లేని మొండం లాంటిదంటూ.. తమకున్న అనుబంధాన్ని చెప్పుకున్నారు.
తెలంగాణవాదులు తమ వాదనను అంత బలంగా వినిపిస్తే.. సీమాంధ్రుల వైపు నుంచి వాదనే లేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో విభజన పూర్తి అయి.. దాదాపు 13 నెలలు గడిచిన తర్వాత హైదరాబాద్ మీద ఆశలు పెట్టుకోవటం ఏమాత్రం సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ గురించి తన వాదనను వినిపించిన ఆయన ఆసక్తికరమైన ఒక వ్యాఖ్యను చేశారు. హైదరాబాద్ తెలంగాణ గుండె చప్పుడు అయితే దానికి రక్తం సరఫరా చేసింది సీమాంధ్ర ప్రజలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలు ఉమ్మడిగా ఉన్న సమయంలోనో.. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే సమయంలో బాగుంటాయి కానీ.. విభజన పూర్తి అయిన తర్వాత ఎంత చెప్పినా అంత సబబుగా ఉండదన్న విషయం పల్లెకు ఎవరు చెబుతారు? విభజన సమయంలోనూ.. విభజనకు వ్యతిరేకంగా ఉధృతంగా సాగిన సమైక్య ఉద్యమ సమయంలో.. ఇలాంటి విషయాలు బలంగా ప్రస్తావించాల్సింది పోయి.. అంతా అయిపోయిన తర్వాత ఎన్ని లెక్కలు.. మరెన్ని సెంటిమెంటు మాటలు మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు చెప్పాల్సిన మాట అప్పుడు చెప్పాలి కానీ.. అంతా అయిపోయిన తర్వాత లెక్కల గురించి మాట్లాడటం ఏ మాత్రం సమంజసంగా ఉండదు.