Begin typing your search above and press return to search.

కోనసీమ అల్లర్లలో మాజీ మంత్రి అనుచరుడితో సహా 18 మంది అరెస్టు..!

By:  Tupaki Desk   |   7 Jun 2022 3:11 AM GMT
కోనసీమ అల్లర్లలో మాజీ మంత్రి అనుచరుడితో సహా 18 మంది అరెస్టు..!
X
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసంకు సంబంధించి పోలీసుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులతోపాటు రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించింది.. టీడీపీ నేత మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనుచరులు గంధం పల్లంరాజేనని పోలీసులు తేల్చారు.

ఈ నేపథ్యంలో అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్‌, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు.. గంప అనిల్‌, యాళ్ల నాగులతోపాటు 18 మందిని జూన్ 6న అరెస్టు చేశారు. వీరిలో ఫేసుబుక్, వాట్సాప్ తదితర సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 129 మందికి చేరింది. కాగా 18 మంది నిందితులను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. రిమాండు కోసం జైలుకు తరలించినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు.

గంధం పల్లంరాజుపై అమలాపురం, పరిసర ప్రాంతాల్లో పలు కేసులతో పాటు రౌడీషీట్‌ కూడా ఉండేది. ఈ రౌడీషీట్‌ను టీడీపీ ప్రభుత్వ హయాంలో నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా ఉన్న ఎత్తేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఇసుక అక్రమ రవాణా, తదితర దందాలు నడిపిన గంధం పల్లంరాజు అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించాడు. అమలాపురంలో మే 24న చలో కలెక్టరేట్‌ ర్యాలీ సందర్భంగా అల్లర్లలో పల్లంరాజు క్రియాశీలకంగా వ్యవహరించాడని పోలీసులు అంటున్నారు. రౌడీషీటర్లను అమలాపురం వీధుల్లో ఉంచి.. వారంతా ఒకేసారి ర్యాలీలోకి ప్రవేశించేలా స్కెచ్‌ను అమలు చేశాడని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పల్లంరాజుకు అమలాపురానికే చెందిన గంప అనిల్‌, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన యాళ్ల నాగులు సహకరించారని పోలీసులు వెల్లడించారు.

కాగా అమలాపురం అల్లర్లు, విధ్వంసం అంతా వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే సాగించారని పోలీసులు చెబుతున్నారు. అల్లర్లు, విధ్వంసం కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టారని అంటున్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు అల్లర్లకు పాల్పడేవారికి సమాచారం అందించారని చెబుతున్నారు. ఏ సమయంలో దాడులకు పాల్పడాలో కూడా స్కెచ్ గీశారని, పక్కా ప్రణాళిక ప్రకారం కుట్రను అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ మేరకు వాట్సాప్‌ సందేశాలు, కాల్‌ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పోలీసులను పూర్తి ఆధారాలను సేకరించారని తెలుస్తోంది.

కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తారని చర్చ జరుగుతోంది. మరోవైపు అమలాపురంతోపాటు కోనసీమ అంతటా 144 సెక‌్షన్, సెక‌్షన్‌ 30 కొనసాగుతున్నాయి.