Begin typing your search above and press return to search.

సీఎం ఇల్లు రూ.900 కోట్లు కాదు.. రూ.36 కోట్లే

By:  Tupaki Desk   |   29 Nov 2016 4:16 AM GMT
సీఎం ఇల్లు రూ.900 కోట్లు కాదు.. రూ.36 కోట్లే
X
కొన్ని తప్పులు ప్రజల్లోకి పెద్దగా ఫోకస్ కావు. కానీ.. మరికొన్ని తప్పులు మాత్రం అందుకు భిన్నంగా ప్రజల్లో భారీగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంటాయి. తాజాగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాస గృహప్రవేశ కార్యక్రమం ఇదే రీతిలో సాగిందని చెప్పాలి. ఇప్పటికే ఉన్న పెద్దభవనాన్ని కేవలం నమ్మకం కోసం మార్చేసి.. కొత్త భవనాన్ని నిర్మించటంపై ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్లినట్లుగా చెప్పక తప్పదు

దీనికి తోడు.. అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ భవనానికి సంబంధించిన ముచ్చట్లు తెలంగాణ ప్రజల మనసుల్లోకి బాగా వెళ్లినట్లు చెప్పకతప్పదు. తెలంగాణ రాష్ట్ర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం అధికార నివాసం ఎపిసోడ్ కి సంబంధించి తెలంగాణ అధికార పక్షం ఇప్పటివరకూ సమర్థవంతమైన వాదనను వినిపించలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. డాబుసరి కోసం మాత్రమే అధికారిక నివాసం అన్న భావన ప్రజల్లోకి వెళ్లటం కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బ తీసిందన్న మాట వినిపిస్తోంది.

దీనికితోడు.. పేద ప్రజలకు కట్టించి ఇస్తానని చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్ల కార్యక్రమం మీద ముందడుగు లేకపోవటం.. వివిధ భవన్ల విషయంపై ఎలాంటి అభివృద్ధి లేకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాన్ని రోజుల తరబడి చేసే అధికారపక్షం.. సీఎం నివాసం ఉండే ఇంటి విషయంలో మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయటాన్ని తప్పు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నివాసానికి పెట్టిన ఖర్చుపై విపక్షాలు చెబుతున్న మాటలు తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాయి.

దీనికి తగ్గట్లే తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మాటల్నే తీసుకుంటే.. 8 ఎకరాల్లో రూ.50 కోట్ల ఖర్చుతో ఒక్క ఏడాదిలోనే సీఎం అధికారిక నివాసాన్ని నిర్మించినప్పుడు.. గ్రామాల్లో రెండేళ్లుఅయినా డబుల్ బెడ్రూం ఇళ్లను ఎందుకు నిర్మించలేదన్న సూటి ప్రశ్న తెలంగాణ ప్రజలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుందన్న భావన వ్యక్తమవతోంది. ఎవరి విశ్వాసాలు వారివని.. అలా అని ఒకరి విశ్వాసాల కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారన్న కోదండం మాష్టారి ప్రశ్న సీఎం కేసీఆర్ తీరును వేలెత్తి చూపించేలా చేస్తుందనటంలో సందేహం లేనట్లే.

సీఎం అధికార నివాసం కోసం రూ.500 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ అధికారపక్షం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా.. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం అధికార నివాసం కోసం రూ.35 కోట్లను ఖర్చు చేయగా.. అంతకు మించి ఖర్చు చేసినట్లుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. వందలాది కోట్లు ఖర్చుపెట్టినట్లుగా సాగుతున్న ప్రచారం నిజం కాదని.. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త ఇంటిని నిర్మించినట్లుగా సర్ది చెబుతున్నారు. ప్రజల మనసుల్లో కొన్ని విషయాలు తీవ్రప్రభావాన్ని చూపించటమే కాదు.. ఎంత చెప్పినా వాటిని చెరపలేని పరిస్థితి. కేసీఆర్ కొత్త ఇంటి ముచ్చట కూడా అదే తీరులో ఉందన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/