Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే 'మ‌ర‌ణ దిన ఆహ్వానం' నిజంగానే!

By:  Tupaki Desk   |   17 Dec 2022 12:30 PM GMT
మాజీ ఎమ్మెల్యే మ‌ర‌ణ దిన ఆహ్వానం నిజంగానే!
X
పుట్టిన వాళ్లు గిట్ట‌క మాన‌రు! ఇదీ.. మతాల‌కు అతీతంగా.. ప్ర‌తి ఒక్క సిద్ధాంతం చెప్పే మాట‌. పుట్టిన వారు ఏదో ఒక రోజు చ‌నిపోవాల్సిందే. అయితే.. అంత‌మాత్రాన‌.. నిత్యం మ‌నం చ‌నిపోయేందుకు మాత్ర‌మే పుట్టామ‌ని ఎవ‌రూ తాము చేయాల్సిన ప‌నులు ఆపేసి విల‌పించ‌రు! చూస్తూ కూర్చోరు కూడా! మ‌ర‌ణం త‌థ్య‌మే. అది ఎప్పుడు ఏ రూపంలో ఎక్క‌డ వ‌స్తుందో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చెప్ప‌లేదు. ఎన్నో రూపాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందినా.. మ‌ర‌ణ స‌దృశ‌మ‌య్యే రోజును మాత్రం గ‌ణించ‌లేక పోతున్నారు.

ఎవ‌రో ఒక‌రిద్ద‌రు రామ‌కృష్ణ పర‌మ‌హంస‌, వివేకానందుడు, అరుణాచ‌లం ర‌మ‌ణ‌మ‌హ‌ర్షి, డొక్కా సీత‌మ్మ వంటివార్ల‌కు మాత్ర‌మే మ‌ర‌ణ స‌దృశ‌మ‌య్యే రోజు ముందుగానే తెలిసింద‌ని వారి వారి జీవిత చరిత్ర‌లు చెబుతున్నాయి.

స‌రే! సాధార‌ణ మాన‌వుల‌కు ఈ అవ‌కాశ‌మేలేదు. కానీ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ నాయ‌కులు.. పాలేటి రామారావు మాత్రం వినూత్నంగా ఆలోచ‌న చేశారు. తాను ఎప్పుడు చ‌నిపోయేదీ చెబుతూ.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

తాను 1959లో పుట్టాన‌ని.. ప్ర‌స్త‌సుతం 63వ ఏడులో ఉన్నాన‌ని.. మ‌రో 12 సంవత్స‌రాల్లో చ‌నిపోతాన‌ని.. ఆయ‌న తెలిపారు. అంటే.. తాను 2034లో తుదిశ్వాస విడుస్తాన‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో తాను ఈ నెల 17(అంటే.. శ‌నివారం)న 12వ మ‌ర‌ణ దినాన్ని నిర్వహించుకుంటున్నాన‌ని.. అంద‌రూ రావాల‌ని.. ఆహ్వాన ప‌త్రిక‌ను ముద్రించారు.

అంతేకాదు, చీరాల‌లోని ఓ హాల్‌లో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. మ‌రి దీనిలో ఏం చేస్తారో తెలియ‌దు కానీ, ప్ర‌స్తుతం అయితే.. మాజీ ఎమ్మెల్యే పాలేటి ఆహ్వాన ప‌త్రిక మాత్రం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రినీ ఆక‌ర్షిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే, పాలేటి ప్ర‌స్తుతం చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకు ముఖ్య అనుచ‌రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో టీడీపీలో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుని మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇప్పుడు రాజ‌కీయంగా నైరాశ్యంలో ఉన్నందునే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేందుకు పాలేటి ఇలా మ‌ర‌ణ ఆహ్వానం పేరిట వార్త‌ల్లోకి వ‌చ్చార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.