Begin typing your search above and press return to search.

అమ్మ కుర్చీలో చిన్నమ్మ విధేయుడా?

By:  Tupaki Desk   |   20 Feb 2017 4:04 PM GMT
అమ్మ కుర్చీలో చిన్నమ్మ విధేయుడా?
X
ఈ ఉదంతం గురించి వింటే.. ఇలాంటి సందేహమే కలగటం ఖాయం. అమ్మ మాత్రమే కూర్చునే ప్రత్యేకమైన కుర్చీ గురించి అందరికి తెలిసిందే. అమ్మకున్న సెంటిమెంట్లలో అతి ముఖ్యమైన సెంటిమెంట్ ఆమె వాడే కుర్చీ. తాను ఎక్కడికి వెళ్లినా తనతో తన కుర్చీని ఆమె తీసుకెళతారు. చివరకు ప్రధానమంత్రితో భేటీ అయినా సరే.. ఆమె తన కుర్చీని ఢిల్లీకి తీసుకెళ్లి.. తన కుర్చీలోనే కూర్చొని మాట్లాడి వస్తారు.

అంత ప్రత్యేకంగా చూసుకునే అమ్మ కుర్చీలో తాజాగా చిన్నమ్మ విధేయుడు పళనిస్వామి కుర్చోవటం సంచలనంగా మారింది. అమ్మ బతికి ఉన్నప్పుడు.. చనిపోయిన తర్వాత.. ఆమె వీర విధేయుడిగా వ్యవహరించే పన్నీర్ సెల్వం.. అమ్మ కుర్చీలో అమ్మ ఫోటో ఉంచేవారే తప్పించి.. అందులో కూర్చునేవారే కాదు. అందుకు భిన్నంగా.. తాజా బలపరీక్షలో విజయం సాధించిన పళని స్వామి మాత్రం అందుకు భిన్నంగా.. అమ్మ కుర్చీలో ఠీవీగా కూర్చున్న వైనానికి చాలామంది నోట మాట రాలేదని చెబుతున్నారు.

అమ్మ జైలుకు వెళ్లినప్పుడు.. అనారోగ్యంతో ఆసుపత్రో ఉన్నప్పుడు ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం.. అమ్మ కుర్చీని టచ్ కూడా చేసేవారు కాదు. తన చర్యలతో అమ్మకు తానెంత మర్యాద.. గౌరవం ఇస్తున్న విషయాన్ని చెప్పటంతోపాటు.. అమ్మకు పేరిట ఆమె పాలనను తాను అందిస్తున్నట్లుగా తన చర్యలతో చెప్పేవారు పన్నీర్ సెల్వం.

అందుకు భిన్నంగా.. ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళని స్వామి.. నేరుగా జయలలిత ఆఫీస్ కు వెళ్లి.. ఆమె కూర్చునే ప్రత్యేకకుర్చీలో కూర్చొని సంతకాలు పెట్టటం గమనార్హం. అనంతరం అధికారులతో సమావేశాల్ని నిర్వహించారు. అమ్మ కుర్చీలో కూర్చోవటంపై విమర్శలు వస్తాయని అనుకున్నారో ఏమో కానీ.. తన కుర్చీ ఎదుట అమ్మ ఫోటోను మాత్రం ఆయన పెట్టుకొని తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

అయితే.. అమ్మ అభిమానులు మాత్రం పళని చర్యను ఎంతమాత్రం సమర్థించటం లేదు. అమ్మ కుర్చీలోనే పళని కూర్చుంటారా? అంటూ ప్రశ్నిస్తున్న వారు.. పన్నీర్ సెల్వం ఎలా అయితే వ్యవహరించారో అలా చేయాల్సింది కానీ.. ఆమె కుర్చీలో కూర్చోవటం ద్వారా చిన్నమ్మ విధేయుడు అమ్మను అవమానించినట్లుగా మండిపడుతున్నారు. చిన్నమ్మ విదేయుడి చేష్ట ఆత్మ రూపంలో ఉన్న అమ్మ.. తన విధేయుడు పన్నీర్ సెల్వానికి ఏమని చెబుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/