తమిళనాట ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడేం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నది జగమెగిరిన సత్యమే. దివంగత సీఎం జయలలిత హఠాన్మరణంతో తమిళనాట ఏర్పడ్డ రాజకీయ శూన్యతను పూరించే వారు ఎవరు వస్తారా? అంటూ అటు తమిళ తంబీలతో పాటు దేశం మొత్తం కూడా ఆ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే తమిళనాడులో ఎలాంటి రాజకీయ శూన్యత లేదంటూ చెప్పేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో పాటు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం కూడా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే వస్తున్నారు. ఇక జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ కూడా తన వంతుగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు చేయని యత్నమంటూ లేదు.
ఈ క్రమంలోనే ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం సాగుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మొన్నామధ్య అభిమానులతో ఫొటో షూట్ పేరిట నానా హంగామా చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి అభిమానుల మనోగతాన్ని స్వయంగా తెలుసుకునేందుకే రజనీ ఈ ఫొటో షూట్ ఏర్పాటు చేసుకున్నారన్న వాదన వినిపించింది. అయితే ఎందుకనో నాడు.. రజనీ ఫొటో షూట్ ముగియగానే సెలెంట్ అయిపోయారు. ఆ మరుక్షణమే తమిళ సినీ ఇండస్ట్రీకే చెందిన మరో స్టార్ హీరో కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా పరోక్షంగా పలు ప్రకటనలు చేశారు. ట్విట్టర్ వేదికగా సాగిన ఆయన ట్వీట్ల వర్షం... తమిళ నాట నిజంగానే పెను కలకలమే రేపింది. అయితే ఆయన కూడా ఆ తర్వాత ఎదుకనో గానీ తగ్గిపోయారు.
ఈ రెండు ఉదంతాలపై కాస్తంత సీరియస్ గానే ఉన్న ఆ రాష్ట్ర సీఎం పళనిసామి తాజాగా తన సీరియస్ నెస్ ను బయటపెట్టేశారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ జయంతోత్సవాల సందర్భంగా పెరంబలూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సందర్భంగా పళనిస్వామి రజనీ పొలిటికల్ ఎంట్రీపై పరోక్షంగా సెటైర్లు సంధించారు. రజనీకాంత్ వ్యవహారానికి సంబంధించి కాస్తంత సెటైరిక్ గా పళని చేసిన కామెంట్లు ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ లా మారిపోయాయని చెప్పక తప్పదు.
అయినా రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై పళని ఏమని వ్యాఖ్యానించారన్న విషయానికి వస్తే... *రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ముందుగా ప్రజలకు సేవ చేయాలి. సినీ నటులు రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరకరం. ప్రజల మనసులు గెలుచుకోకుండా ఎవరూ అందలం ఎక్కలేరు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోయాలని జరుగుతున్న ప్రయత్నాలు ఫలించబోవు. అమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం తమ ప్రభుత్వానికి ఢోకా లేదు* అని పళనిసామి కాస్తంత ఘాటుగానే కామెంట్లు చేశారు.