Begin typing your search above and press return to search.

పళ‌ని..ప‌న్నీర్‌ ల కాంబినేష‌న్లో ఛాన‌ల్‌..పేప‌ర్‌

By:  Tupaki Desk   |   4 Oct 2017 10:00 AM GMT
పళ‌ని..ప‌న్నీర్‌ ల కాంబినేష‌న్లో ఛాన‌ల్‌..పేప‌ర్‌
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్ని నిశితంగా గ‌మ‌నిస్తే అక్క‌డో చిత్ర‌మైన అంశం క‌నిపిస్తుంది. ప్ర‌తి రాజ‌కీయ పార్టీకి ఒక ఛాన‌ల్‌.. దిన‌ప‌త్రిక ఉండ‌టం రివాజు. ఎంజీఆర్ మొద‌లు ఈ అల‌వాటు ఉంద‌ని చెబుతారు. త‌మ పార్టీ విధానాలు.. త‌మ సిద్ధాంతాల్ని ప్ర‌చారం చేసుకోవ‌టానికి మిగిలిన మీడియాల మీద ఆధార‌ప‌డే క‌న్నా.. సొంత మీడియా ఉంటే మ‌రింత ఫోకస్డ్ గా ఉంటుంద‌న్న అభిప్రాయం వారిలో క‌లుగుతుంది.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అధికార అన్నాడీఎంకే ప‌రిస్థితి ఎలా త‌యారైంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అమ్మ ప‌గ్గాల్ని చిన్న‌మ్మ చేప‌ట్టినా.. అత్యాశ‌.. అహంకారం క‌ల‌గ‌లిపి ప‌న్నీర్‌ ను దూరం చేసుకున్న శ‌శిక‌ళ‌.. ఆయ‌న‌కు పోటీగా ప‌ళ‌నిని త‌యారు చేశారు. చివ‌ర‌కు వారిద్ద‌రు ఒక‌టి కావ‌టం.. చిన్న‌మ్మ వ‌ర్గానికి చేయిచ్చారు. త‌మ‌దే అస‌లుసిస‌లైన అన్నాడీఎంకే పార్టీగా ప్ర‌చారం చేసుకుంటున్నారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి.. డిప్యూటీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంలు. చిన్న‌మ్మ‌ను పార్టీ నుంచి పంపించేసిన ఇద్ద‌రు నేత‌లు.. ఇప్పుడు పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెప్పాలి. పార్టీ గుర్తు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నెల 6న దీనికి సంబంధించిన నిర్ణ‌యాన్ని ఈసీ వెల్ల‌డించ‌నుంది.

ఇదిలా ఉంటే.. పార్టీ బ‌లోపేతానికి ప‌ళ‌ని.. ప‌న్నీర్‌లు సొంత మీడియాను త‌యారు చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాలు.. మీడియా వ్య‌వ‌స్థ‌లు ఎలా ఉంటాయ‌న్న అవ‌గాహ‌న ఉన్న నేప‌థ్యంలో త‌మ‌కంటూ వేరుగా ఒక టీవీ ఛాన‌ల్‌.. ఒక దిన‌ప‌త్రిక‌ను ఉండ‌టం మంచిద‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా పార్టీకి మూల‌స్తంభాలైన ఎంజీఆర్‌.. జ‌యల పేర్లు క‌లిసి వ‌చ్చేలా టీవీ ఛాన‌ల్.. ప‌త్రిక పేరును సిద్ధం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయ‌టంతో పాటు.. రిజిస్ట్రేష‌న్ల ప‌నులు ఇప్ప‌టికే ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అమ్మ వార‌సులు తామేన‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో నాటుకునేలా చేయ‌టంతో పాటు.. భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషించేందుకు సొంత మీడియా స‌హ‌కారం అవ‌స‌రమ‌న్న అభిప్రాయానికి వారిద్ద‌రూ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

దిన‌ప‌త్రిక‌కు సంబంధించి ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక బృందానికి చెందిన త‌మిళ ప‌త్రిక‌ను.. అలానే ఛాన‌ల్ విష‌యానికి వ‌స్తే ప్ర‌ముఖ త‌మిళ ఛాన‌ల్‌ను సొంతం చేసుకోవ‌టానికి ప్ర‌య‌త్నాలు ముమ్మురం చేశార‌ని చెబుతున్నారు. ఈ నెల 6న పార్టీ గుర్తు అయిన రెండాకులపై స్ప‌ష్ట‌త వ‌చ్చినంత‌నే మ‌రింత వేగంగా మీడియా వ్య‌వ‌హారాల్ని పూర్తి చేస్తార‌ని చెబుతున్నారు.

దిన‌ప‌త్రిక‌.. టీవీ ఛాన‌ల్‌ కు సంబంధించిన ప‌నులు చ‌క్క‌దిద్దేందుకు వీలుగా త‌న‌కు ఎంతో న‌మ్మ‌క‌మైన మంత్రులు మ‌ణి.. పాండియ‌రాజ‌న్ ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ‌దైన మీడియాతో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చేరువ కావాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి.. ఉప ముఖ్య‌మంత్రిప‌న్నీర్ సెల్వం ఆలోచ‌న‌గా చెబుతున్నారు.