Begin typing your search above and press return to search.

ఉత్సాహం మిస్.. రెండు వర్గాల్లోనూ నీరసమే

By:  Tupaki Desk   |   16 Feb 2017 5:02 AM GMT
ఉత్సాహం మిస్.. రెండు వర్గాల్లోనూ నీరసమే
X
విషయం ఏదైనా కానీ.. ఇద్దరు పోటీ పడుతున్నప్పడు ఒకరు ఉత్సాహంగా.. మరొకరు నీరసంగా ఉండటమో.. లేదంటే ఇరువురు ఉత్సాహంగా ఉండటమో ఉంటుంది. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమిళనాడులోని అధికారపక్షంలోని రెండు వర్గాల్లో నెలకొన్న వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్నమొన్నటివరకూ ఉత్సాహంతో ఉరకలేసిన రెండు వర్గాలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా నీరసంగా.. నిరాశతో కనిపించటం గమనార్హం.

చిన్నమ్మ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్ సెల్వం.. మొన్నటి వరకూ మహా ఉత్సాహంగా ఉన్నారు. పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేనప్పటికీ.. ఆయన చాలా ధీమాగా కనిపించారు. అందుకుతగ్గట్లే.. ఆయన ఇంటి ముందు సందడి.. సందడి వాతావరణం కనిపించింది. ప్రజలు సైతం పన్నీర్ వైపే ఉన్నట్లుగా వాతావరణం నెలకొంది. దీనికి తోడు.. అప్పుడప్పడు బయటకు వచ్చి.. మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసి వెళ్లేవారు.

ఇదిలా ఉంటే.. పన్నీర్ మీద ఆగ్రహంతో శశికళ వర్గం ఊగిపోయేది. తామంతా ఎకతాటి మీద ఉన్నట్లుగా అవకాశం వచ్చిన ప్రతిసారీ చెప్పేవారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నందున ప్రభుత్వాన్నిఏర్పాటు చేసే అవకాశాన్ని తమకే ఇవ్వాలంటూ డిమాండ్ చేయటమే కాదు.. గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఇలా రెండు వర్గాలు అవకాశం తమదేనని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ.. ఉత్సాహంతో ఎవరికి వారు వ్యూహాల్ని సిద్ధం చేసుకోవటం కనిపిస్తుంది.

అయితే.. బుధవారం మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం రెండు వర్గాల్లోనూ కనిపించటం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి ఏర్పడటంతో చిన్నమ్మ వర్గం ఒక్కసారిగా చిన్నపోయింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. వారిని నిరాశ కమ్మేసింది. తమను నడిపించే చిన్నమ్మ లేని వైనం వారిలో ఉత్సాహమన్నది లేకుండా చేసింది.

మరోవైపు.. పన్నీర్ వర్గానికి అలాంటి పరిస్థితే. తామెంత ప్రయత్నంచేస్తున్నా.. ఎమ్మెల్యేలు పెద్దగా రాకపోవటం.. రిసార్ట్స్ లోనే అత్యధిక ఎమ్మెల్యేలు ఉండటంతో పన్నీర్ వర్గంలో ఉత్సాహం మిస్ అయ్యింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. ఎమ్మెల్యేల టోన్ లో మార్పువస్తుందని.. వీలైనంత ఎక్కువమంది తమ వద్దకు వచ్చేస్తారని భావించినా.. అలాంటిదేమీ చోటు చేసుకోకపోవటం వారిని నిరాశకు గురి చేసింది.

దీనికి తగ్గట్లే పన్నీర్ ఇంటి వద్ద సందడి తగ్గిపోయింది. బుధవారం మొత్తం పన్నీర్ ఇంటి పరిసరాలకు వచ్చిన వారు తక్కువ మందేనని చెప్పాలి. దీనికి తగ్గట్లే నిత్యం పలుమార్లు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే పన్నీర్.. బుధవారం మొత్తమ్మీదా ఒక్కసారి కూడా బయటకు రాలేదు. మొత్తంగా చూస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న ఇరు వర్గాల్లోనూ ఉత్సాహం అన్నది లేకుండా నిరాశలో కూరుకుపోయి నీరసంగా కనిపిస్తుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/