Begin typing your search above and press return to search.

పక్కా లోకల్ టీఆర్ఎస్ కు.. ‘నాన్ లోకల్’ అంటూ ఆడేసుకుంటున్నారట

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:50 AM GMT
పక్కా లోకల్ టీఆర్ఎస్ కు.. ‘నాన్ లోకల్’ అంటూ ఆడేసుకుంటున్నారట
X
నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా.. మొన్నటివరకు తాము ప్రయోగించిన ఆయుధాన్ని తిరిగి తమ మీద ప్రయోగిస్తున్న విపక్షాల దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నా.. అధికారపీఠం మాత్రం టీఆర్ఎస్ దే. దుబ్బాకలో మాదిరి గ్రేటర్ లోనూ ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి.. జీహెచ్ఎంసీ పీఠం సొంతం కావటం అసాధ్యం. అలా అని గెలుపు గులాబీ దళానికి అంత సింఫుల్ గా రావట్లేదు. అందుకోసం గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమించాల్సి వస్తోంది.

ఎన్నికలు.. ఉప ఎన్నికలు.. ఫార్మాట్ ఏదైనా ఇరగదీసే గులాబీ సైన్యానికి.. గ్రేటర్ ఎన్నికలు చేదు అనుభవాల్ని చాలానే మిగిలిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్న టీఆర్ఎస్ అధినాయకత్వం.. 150 డివిజన్లకు దాదాపు 180కు పైగా ఇంఛార్జుల్ని నియమించింది. ఒక బుడ్డ డివిజన్ కు ఇంఛార్జులుగా నియమించిన వారు ఎవరంటే.. కొమ్ములు తిరిగిన మంత్రులు.. సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు.. తిమ్మిని బమ్మిని.. బమ్మిని తిమ్మిని చేసే సామర్థ్యం ఉన్నోళ్లు.. పార్టీ కోసం దేనికైనా రెఢీ అనే సత్తా ఉన్నోళ్లు.

అధినేత తమపై ఉంచిన విశ్వాసానికి ఫిదా అయి పోయిన వారు.. తమకు అప్పగించిన డివిజన్ రఫ్పాడిస్తామని జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అయితే.. వారి అంచనాలు పూర్తిగా తేడా కొట్టేస్తున్నాయంటున్నారు. మంత్రులుగా జిల్లా మొత్తాన్ని.. ఆ మాటకు వస్తే రాష్ట్రాన్ని శాసించే సత్తా ఉన్న నేతలకు.. డివిజన్ రాజకీయాల్ని తట్టుకోవటం మాత్రం కష్టసాధ్యంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

పక్కా లోకల్ రాజకీయాల్ని వారు జీర్ణించుకోలుకపోతున్నారట. ఏదైనా తేడా వస్తే.. లోకల్..నాన్ లోకల్ మాటలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారట. అన్నింటికి మించి.. బయట జిల్లాల నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలకు విపక్ష పార్టీలకు చెందిన కొందరు మాటలతో.. చేతలతో చుక్కలు చూపిస్తున్నారట. లోకల్ నినాదంతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ పార్టీకి పక్కా లోకల్స్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. వారికి సమాధానం చెప్పలేక.. కిందా మీదా పడుతున్నారట. ఈ తరహా రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా? అని వాపోతున్నారట. మొత్తానికి తాము తరచూ తెర మీదకు తీసుకొచ్చే లోకల్ నినాదం..గ్రేటర్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తీసిందన్న మాటను గులాబీ నేతలు చెబుతుండటం గమనార్హం.