Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ అరెస్టుకు భారీగా పోలీసులు.. మంట పుట్టేలా వీడియో సందేశం

By:  Tupaki Desk   |   15 March 2023 9:35 AM GMT
ఇమ్రాన్ అరెస్టుకు భారీగా పోలీసులు.. మంట పుట్టేలా వీడియో సందేశం
X
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పీటీఐ) నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవటం.. పోలీసుల్ని ఇమ్రాన్ ఇంటి వరకు వెళ్లకుండా చేయటం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా పోలీసులు ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రతి ఘటన ఎదురైంది. అయితే.. దాన్ని ఎదుర్కొంటూనే పోలీసులు ఇమ్రాన్ ఇంటి వరకు పోలీసులు వెళ్లగలిగారు. అయితే.. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లుగా చెబుతున్నారు.

ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకునేందుకు అడ్డంకులు ఏర్పడటంతో.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించగా.. అందుకు ప్రతిగా పీటీఐ కార్యకర్తలు రాళ్ల వర్షాన్ని కురిపించినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు. ఇంతటి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా.. ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.

ఏ క్షణంలో అయినా ఇమ్రాన్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి వేళ.. ఇమ్రాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేసి జైల్లో తనను చంపేందుకు ప్లాన్ వేశారని.. అలాంటిది జరిగినా ప్రజలు చేస్తున్న పోరాటాన్ని మాత్రం అపొద్దని పేర్కొన్నారు. తనను జైల్లో పడేసేందుకు పోలీసులు వచ్చారని.. ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళితే.. దేశం కామ్ గా ఉంటుందని అనుకుంటున్నారని.. కానీ అది తప్పన్న విషయాన్ని నిరూపించాలని పిలుపునిచ్చారు.

హక్కుల పోరాటంలో భాగంగా బయటకు రావాలన్న ఆయన.. ‘‘ఇమ్రాన్ కు అల్లా అన్నీ ఇచ్చారు. నేను మీ కోసం పోరాడుతున్నా. నా జీవితాన్ని మీకోసం పోరాడాను. మీకోసం పోరాడతాను. జైల్లో నన్ను చంపేసినా మీరు పోరాడాలి. ఇమ్రాన్ లేకున్నా ఈ దేశంలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏకపక్ష నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. వ్యతిరేకించాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఈ వీడియో అతి స్వల్ప వ్యవధిలోనే వైరల్ గా మారింది.