Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మను సాయం కోరిన పాకిస్థానీ

By:  Tupaki Desk   |   9 July 2017 8:41 AM GMT
చిన్న‌మ్మను సాయం కోరిన పాకిస్థానీ
X
ఒక కేంద్ర‌మంత్రికి ఒక సామాన్యుడి అవ‌స‌రం తెలిసే అవ‌కాశం ఉందా? అంటే.. లేద‌నే చెప్పే వారు కొద్ది కాలం కింద‌టి వ‌ర‌కూ. సాంకేతిక‌త పుణ్య‌మా అని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఎవ‌రు ఎక్క‌డ ఉన్నా.. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారి దృష్టికి త‌మ వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల్ని తీసుకెళ్లే సౌక‌ర్యం సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ల‌భిస్తోంది.

మిగిలిన నేత‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. మోడీ మంత్రివ‌ర్గంలోని కొంద‌రు కేంద్ర‌మంత్రులు కొంద‌రు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న శాఖ‌కు సంబంధం లేని అంశాల‌కు సైతం స్పందించే గుణం చిన్న‌మ్మ‌గా పిలుచుకునే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ సొంతం.

కొన్ని వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సైతం ఆమె స్పందిస్తూ.. అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటున్నారు. ఇటీవ‌ల పాకిస్తాన్ కు చెందిన ఓ చిన్నారికి అవ‌స‌ర‌మైన స‌ర్జ‌రీ కోసం వీసా సాయం అందించిన సుష్మాకు తాజాగా మ‌రో పాకిస్థాన్‌ కు చెందిన 25 ఏళ్ల మ‌హిళ ట్వీట్ తో సాయాన్ని కోరింది.

తాను కొంత‌కాలంగా ఓర‌ల్ క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్న‌న‌ని.. ఘ‌జియాబాద్ లోని ఇంద్ర‌ప్ర‌స్థా డెంట‌ల్ ఆసుప‌త్రిలో త‌న‌కు చికిత్స‌ జ‌ర‌గాల్సి ఉంద‌ని ఫైజా త‌న్వీర్ అనే యువ‌తి పేర్కొన్నారు. ఆన్ లైన్ ద్వారా స‌ద‌రు ఆసుప‌త్రికి తాను ఇప్ప‌టికే రూ.5 లక్ష‌లు చెల్లించాన‌ని..కానీ చికిత్స చేయించుకునేందుకు త‌న‌కు వీసా రావ‌టం లేద‌ని పేర్కొంది.

దౌత్య సిబ్బంది త‌న‌కు వీసాను మంజూరు చేయ‌టం లేద‌ని వాపోయిన‌ ఆమె.. త‌న‌ను బ‌తికించాల‌ని సుష్మాను వేడుకుంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ల‌కు వెంట‌నే స్పందించే సుష్మా.. తాజాగా శ‌త్రుదేశానికి చెందిన యువ‌తి అప్పీల్‌ కు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.